పాకిస్తాన్‌తో మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా తొలి వన్డేలో గెలిచి వన్డే సిరీస్‌ను విజయంతో ప్రారంభించింది. మెల్‌బోర్న్ వేదికగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచింది.పాక్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని(204) ఛేదించే క్రమంలో 167 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఓవర్ ఓవర్‌కు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకు అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఇక ఈ గెలుపుతో వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్‌తో ఆడిన తక్కువ మ్యాచ్‌లలోనే.. ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా ఆసీస్ చరిత్ర సృష్టించింది.ఇప్పటి వరకు పాక్‌తో 109 మ్యాచ్‌లు ఆడిన కంగారూ జట్టు 71 మ్యాచ్‌లలో జయభేరి మోగించింది. ఇక ఈ జాబితాలో వెస్టిండీస్ రెండోస్థానంలో ఉంది. ఆసీస్‌తో సమానంగా 71సార్లు పాక్‌పై గెలుపొందినప్పటికీ.. మ్యాచ్‌ల పరంగా ఆసీస్ కంటే వెనుకబడింది.
పాక్ 46.4 ఓవర్లలో కేవలం 203 పరుగులే చేసింది.రిజ్వాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టెయిలెండర్ నసీం షా 40 రన్స్‌తో రాణించాడు. లక్ష్య ఛేదనలో కమిన్స్ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడంతో 33.3 ఓవర్లలో పనిపూర్తి చేసింది.
ఆస్ట్రేలియా జట్టు
మాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆరోన్ హార్డీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
పాకిస్తాన్ జట్టు
అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, ఆఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.