Willow Moore Park, FEB 11: గతేడాది భారత్‌కు రెండు ఐసీసీ (ICC) ట్రోఫీలను దూరం చేసిన ఆస్ట్రేలియా (IND Vs AUS) తాజాగా జూనియర్ లెవల్‌లో కూడా దెబ్బకొట్టింది. 2023 జూన్‌లో పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆసీస్ (AUS).. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రోహిత్ సేనను చిత్తు చేసింది. మళ్లీ నవంబర్‌లో భారత్‌లోనే జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా అసలు ఓటమన్నదే లేకుండా ఫైనల్ చేరిన భారత జట్టును ఓడించి ప్రపంచకప్ (ICC Under 19 World Cup 2024) ఎగురేసుకుపోయింది. తాజాగా పెద్దలు (రోహిత్ సేన) చూపిన బాటలోనే ఉదయ్ సహరన్ సారథ్యంలోని యువ భారత్ పయనించింది. ఫైనల్ దాకా ఓ రేంజ్ ఆట ఆడిన టీమిండియా.. తుదిపోరులో యావరేజ్ ఆట కూడా ఆడలేక చతికిలపడింది. ఫలితంగా దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ – 19 మెన్స్ వరల్డ్ కప్‌లో కంగారూలు.. భారత్‌ను (India) ఓడించి విశ్వవిజేతలుగా నిలిచారు.
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆
After #WTC23 and #CWC23, Australia complete the hat-trick with #U19WorldCup 2024 😍 pic.twitter.com/Y6cmaLOTu0
— ICC (@ICC) February 11, 2024
ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్‌కు వచ్చిన మన కుర్రాళ్లు.. తుది పోరులో బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించినా బ్యాటింగ్‌లో విఫలమై ఆరో టైటిల్‌ను అందుకునే అవకాశాన్ని చేజేతులా వదులుకున్నారు. ఫైనల్‌లో ఆసీస్ నిర్దేశించిన 254 పరుగుల ఛేదనలో యువ భారత్.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఆసీస్.. 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచింది. అండర్ – 19 స్థాయిలో ఆస్ట్రేలియాకు ఇది నాలుగో ట్రోఫీ కాగా.. 2012, 2018 ఫైనల్స్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాభవానికి కంగారూలు బదులుతీర్చుకున్నారు. 2010 తర్వాత ఆసీస్‌కు ఇదే తొలి అండర్ – 19 వరల్డ్ కప్ ట్రోఫీ కావడం విశేషం.
బెనోని వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ (ICC Under 19 World Cup 2024) నిర్దేశించిన 254 పరుగుల ఛేదనలో భారత్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. మూడో ఓవర్లోనే ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (3) వికెట్ కోల్పోయిన భారత్‌ను ముషీర్ ఖాన్ (22), ఆదర్శ్ సింగ్ (47) నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 37 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఇదే హయ్యస్ట్ పార్ట్‌నర్‌షిప్. ముషీర్‌ను బీర్డ్‌మన్ ఔట్ చేయడంతో భారత మిడిలార్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టింది. సెమీస్‌లో అద్భుత పోరాటంతో ఆకట్టుకున్న కెప్టెన్ ఉదయ్ సహరన్ (8), సచిన్ దాస్ (9)లు ఫైనల్లో తేలిపోయారు. ప్రియాన్షు మోలియా (9) అదే బాట పట్టాడు. వికెట్ కీపర్ అవినాశ్ రావు డకౌట్ అయ్యాడు.
122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన భారత్.. 174రన్స్ చేయగలిగిందంటే దానికి కారణం ఆఖర్లో స్పిన్నర్ మురుగన్ అభిషేక్ పోరాటమే. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. 46 బంతుల్లో 42 పరుగులు చేసి భారత్ తక్కువ స్కోరుకు ఆలౌట్ కాకుండా ఆసీస్ విజయాంతరాన్ని తగ్గించాడు. ఆసీస్ బౌలర్లలో మహిల్ బీర్డ్‌మన్, మాక్‌మిలన్‌లు తలా మూడు వికెట్లు పడగొట్టారు.