Melbourne: క్రీడా ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. ఆసీస్ దిగ్గజ ఆటగాడు, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు. అతడిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా విఫలమయ్యారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఆండ్రూను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని , అతని ప్రాణాలను కాపాడలేక పోయామని తెలిపారు.
క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 10:30 గంటలకు నగరానికి పశ్చిమాన 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెర్వీ రేంజ్‌లో ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. వేగంగా వెళ్తున్న కారు రోడ్డుపై బోల్తా కొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో ఆండ్రూ సైమండ్స్ మాత్రమే కారులో ఉన్నట్టు తెలుస్తోంది.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆండ్రూ సైమండ్స్‌ను రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా విఫలమయ్యారు. ఈ ప్రమాదంలో సైమండ్స్‌కు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆండ్రూను రక్షించలేకపోయారు.
సైమండ్స్ మరణ వార్తతో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన అభిమానుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఆటగాడు షేన్ వార్న్ కూడా మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో దిగ్గజ ఆటగాడు మరణించడం క్రికెట్ అభిమానులను శోకసంద్రంలో ముంచింది. సైమండ్స్ మృతి పట్ల ప్రముఖులు, మాజీ ఆటగాళ్లు, క్రీడాభిమానులు సంతాపం తెలుపుతున్నారు.