Babar Azam Crying (Photo-X)

New Delhi, NOV 11: భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌ కప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ (Pakistan).. మరోసారి పేలవ ప్రదర్శనతో లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైంది. వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌కు (Semis) క్వాలిఫై కాకపోవడం ఆ జట్టుకు ఇది వరుసగా మూడోసారి. చివరిసారిగా పాక్‌ భారత్‌లో 2011లో జరిగిన వరల్డ్‌ కప్‌లో సెమీస్‌ ఆడింది. ఆ తర్వాత దాయాది జట్టు లీగ్‌ దశ దాటలేదు. పాక్‌ వైఫల్య ప్రదర్శన సారథి బాబర్‌ ఆజమ్‌ (Babar Azam) మెడకు చుట్టుకుంది. నిన్నా మొన్నటిదాకా వన్డేలలో నెంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్న బాబర్‌ (Babar Azam).. ఆ ర్యాంకుతో పాటు తన చెత్త ఆటతీరుతో పరువు కూడా పోగొట్టుకుంటున్నాడు. సోషల్‌ మీడియాలో బాబర్‌ను అతడి ట్రోలర్స్‌ ‘జింబాబర్‌’ అని పిలుస్తుంటారు. అంటే జింబాబ్వే, నేపాల్‌, నెదర్లాండ్స్‌ వంటి చిన్న జట్లపై ఆడుతూ, పీసీబీ తయారుచేసే ఫ్లాట్‌ పిచ్‌ల మీద తప్ప మిగతా చోట ఆడలేడని అతడిపై ఉన్న ప్రధాన విమర్శ. షోయభ్‌ అక్తర్‌, షాహిద్‌ అఫ్రిదితో పాటు పలువురు పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు బహిరంగంగానే బాబర్‌పై ఈ కామెంట్స్‌ చేస్తారు. ఈ మెగా టోర్నీలో విమర్శకుల ఆరోపణలను నిజం చేసేలా సాగింది బాబర్‌ ప్రదర్శన. ఈ టోర్నీలో బాబర్‌ స్కోర్లు 5, 10, 50, 18, 74, 50, 9, 66, 38గా ఉన్నాయి. నాలుగు అర్థసెంచరీలు చేసినా అవి పాకిస్తాన్‌ను కాపాడలేకపోయాయి. ఇక కెప్టెన్‌గా బాబర్‌ జట్టును నడిపించిన తీరుపై పాక్‌ మాజీలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఏ బౌలర్‌ను ఎప్పుడు వాడాలో బాబర్‌కు తెలియదని, వ్యూహాలపరంగా అతడికి జీరో నాలెడ్జ్‌ ఉందంటూ విమర్శల వర్షం కురుస్తోంది.

 

పాకిస్తాన్‌ ఓడినా గెలిచినా తనకు సంబంధం లేదన్నట్టుగా తాను మాత్రం వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంకు (ICC Rank) గురించే ఆడతాడనేది బాబర్‌ మీదున్న ప్రధాన విమర్శ. ఈ టోర్నీలో బాబర్‌ ప్రదర్శన వన్డేలలో అతడి స్థానాన్ని కూడా దిగజార్చింది. బాబర్‌ను అధిగమించిన టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌.. నెంబర్‌ వన్‌ స్థానానికి దూసుకొచ్చాడు.

ఇక బాబర్‌ సారథ్యంలో భారీ టోర్నీలలో పాకిస్తాన్‌ (Pakistan) వరుసగా విఫలమవుతుండటాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాబర్‌ సారథ్యంలో 2021 టీ20 వరల్డ్‌ కప్‌లలో సెమీస్‌, 2022 టోర్నీలో ఫైనల్‌ చేరిన పాకిస్తాన్‌ తుది మెట్టు ముందు బోల్తా కొట్టింది. 2022 ఆసియా కప్‌ ఫైనల్‌లో లంక చేతిలో ఓడింది. ఈ ఏడాది వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ కు క్వాలిఫై కాలేకపోయిన పాక్‌.. ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌ సూపర్‌-6 స్టేజ్‌లోనే నిష్క్రమించింది. తాజాగా వన్డే వరల్డ్‌ కప్‌ లో సైతం లీగ్‌ దశలోనే ఇంటికి చేరింది. కొద్దిరోజుల క్రితమే పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్సీ మార్పుపై హింట్‌ ఇచ్చిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ).. రాబోయే రోజుల్లో ఆ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కెప్టెన్సీ రేసులో షహీన్‌ షా అఫ్రిది, మహ్మద్‌ రిజ్వాన్‌లతో పాటు ఫకర్‌ జమాన్‌ పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో త్వరలోనే పాక్‌ సారథి మార్పు ఉండొచ్చునన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.