గతేడాది టెస్టుల్లో వరుస పరజయాలతో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కొత్త సంవత్సరంలో అద్భుతమైన గెలుపుతో విజయగర్జన చేసింది. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టును ఓడించి సరికొత్త చరిత్ర లిఖించింది. కివీస్ గడ్డపై తమ మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసి సగర్వంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆరంభించింది.
ఈ నేపథ్యంలో మొమినల్ హక్ సారథ్యంలోని జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇబాదత్ హొసేన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.2011 జనవరి (హామిల్టన్‌లో పాకిస్తాన్ విజయం) తర్వాత న్యూజిలాండ్‌లో ఆ జట్టును ఓడించిన తొలి ఆసియా జట్టుగా మొమినల్ బృందం నిలిచింది.
Congratulations @BCBtigers. Well played on all fronts. #NZvBAN pic.twitter.com/EYCU1CpQWV
— BLACKCAPS (@BLACKCAPS) January 5, 2022
ప్రపంచ టెస్టు చాంపియన్ కివీస్‌ను ఓడించడం ద్వారా విదేశీ గడ్డ మీద మేటి జట్టు(టాప్-5)ను మట్టికరిపించడం కూడా బంగ్లాకు ఇదే తొలిసారి. కివీస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టెస్టు విజయం. 16 ఓటముల తర్వాత ఈ గెలుపు బంగ్లా సొంతమైంది.