File picture of IPL trophy (Photo Credits: PTI)

ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -13వ సీజన్‌ (IPL 2020) ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారం అధికారికంగా ప్రకటించింది. నిజానికి గత నెల మార్చి 29 నుంచే ప్రారంభం కావాల్సిన ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్  దేశంలో కరోనావైరస్ లాక్‌డౌన్ (COVID-19 Lockdown) కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా పడింది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 తీవ్రత తగ్గకపోవడం, దేశంలో కూడా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో మొన్న మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను మార్చి 03 వరకు పొడంగించే నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటన వరకు వేచి చూసిన బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, స్పానర్స్, బ్రాడ్ కాస్టర్లతో బుధవారం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేసినా కూడా మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్రస్తుత పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడంతో అందరి ఆమోదం మేరకు ఐపీఎల్-2020 ను నిరవధిక వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనావైరస్‌ వ్యాప్తి సంపూర్ణంగా నిర్మూలించబడి ఎటువంటి ప్రమాదం లేదు అన్న దశలో ఐపీఎల్-2020‌ కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని బీసీసీఐ పెద్దలు స్పష్టం చేశారు.

ఈ ఐపీఎల్-2020 టోర్నమెంట్ గనక రద్దయితే బీసీసీఐ సుమారు రూ.3800 కోట్లు నష్టపోనుందని అంచనా. ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ షెడ్యూల్ చేయబడి ఉంది. ఒకవేళ ఆ టోర్నమెంట్‌ను గనక వాయిదా వేస్తే ఆ సమయంలో ఐపీఎల్2020 నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2020 నిర్వహించే ప‌రిస్థితిపై ఎప్పటికప్పుడు స‌మీక్ష నిర్వ‌హిస్తూ ఉంటామని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.