Ravichandran Ashwin (Photo Credits: Twitter)

Patna, March 08: అంతర్జాతీయ కెరీర్‌లో వందో టెస్టు అంటే ఎవరికైనా ప్రత్యేకమే. ఈ మ్యాచ్‌లో తమ ఆట మరింత ప్రత్యేకంగా ఉండాలని ఏ క్రికెట్‌ అయినా కోరుకుంటాడు. కానీ భారత సీనియర్‌ స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) మాత్రం వందో టెస్టులో బ్యాటింగ్‌ చేస్తూ చెత్త రికార్డును (Unwanted Record) మూటగట్టుకున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన ఆష్‌ అన్న.. బ్యాటింగ్‌లో మాత్రం డకౌట్‌ అయ్యాడు. తద్వారా ఓ చెత్త రికార్డును మూటగట్టుకోవాల్సి వచ్చింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా రెండో రోజు ఆటలో.. అశ్విన్‌ ఐదు బంతులాడి ఒక్క పరుగు కూడా చేయకుండానే (Duck Out In 100th Test) పెవిలియన్‌ చేరాడు. టామ్‌ హర్ట్లీ బౌలింగ్‌లో అశ్విన్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. వందో టెస్టులో డకౌట్‌ అయిన ఆటగాళ్లలో అశ్విన్‌ మూడో ఆటగాడు కాగా అంతర్జాతీయ స్థాయిలో 8వ ప్లేయర్‌. ఇంటర్నేషనల్‌ లెవల్‌లో వందో టెస్టు ఆడుతూ సున్నా పరుగులకే ఔట్‌ అయినవారిలో భారత్‌ నుంచి ఇన్నాళ్లూ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, ఛతేశ్వర్‌ పుజారాలు ఉండగా తాజాగా ఆ జాబితాలో అశ్విన్‌ చేరాడు.

Shubman Gill Six Video: బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌ బాదిన శుబ్‌మన్‌ గిల్‌, బిత్తరపోయిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, వీడియో ఇదిగో.. 

వందో టెస్టులో డకౌట్‌ అయిన ఆటగాళ్లు

దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ : 1988లో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెంగ్‌సర్కార్‌ డకౌట్‌ అయ్యాడు.

అలెన్‌ బోర్డర్‌ (ఆసీస్‌) : 1991లో వెస్టిండీస్‌తో వందో టెస్టు ఆడిన ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్‌ బోర్డర్‌ సున్నా పరుగులకే వెనుదిరిగాడు.

కోట్నీ వాల్ష్‌ (విండీస్‌) : ఇంగ్లండ్‌తో వందో టెస్టు ఆడిన దిగ్గజ పేసర్‌ కోట్నీ వాల్ష్‌ డకౌట్‌ అయ్యాడు.

మార్క్‌ టేలర్‌ (ఆసీస్‌) : 1998లో మార్క్‌ టేలర్‌ ఇంగ్లండ్‌తో గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు.

స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ : 2006లో సెంచూరియన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ దిగ్గజం ఫ్లెమింగ్‌ సున్నా పరుగులకే ఔటయ్యాడు.

బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (కివీస్‌): 2016లో ఆస్ట్రేలియాతో వెల్లింగ్టన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నూరో టెస్టు ఆడిన మెక్‌కల్లమ్‌ 0 కే పెవిలియన్‌ చేరాడు.

అలెస్టర్‌ కుక్‌ (ఇంగ్లండ్‌) : ఇంగ్లీష్‌ మాజీ కెప్టెన్‌ కుక్‌ కూడా వందో టెస్టులో డకౌట్‌ అయ్యాడు.

ఛతేశ్వర్‌ పుజారా : గతేడాది బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ సందర్భంగా ఆసీస్‌తో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వందో టెస్టు ఆడిన పుజారా డకౌట్‌ అయ్యాడు.

తాజాగా ఈ జాబితాలో అశ్విన్‌ చేరాడు.