T20 World Cup 2021 : టీ-20 వరల్డ్ కప్ 2021లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా విధించిన 125 పరుగుల టార్గెట్ ను ఇంగ్లాండ్ కేవలం 11.4 ఓవర్లలోనే ఫినిష్ చేసింది. మరో బంతులు 50 మిగిలుండగానే ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించింది. జాస్ బట్లర్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో విరుచుకుపడగా, బెయిర్ స్టో కూడా 11 బంతుల్లో 16 పరుగులు చేశాడు.125 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. ఓపెనర్లు జాసన్ రాయ్, జోస్ బట్లర్ వీరబాదుడు బాదారు. పవర్ ప్లే ఆరు ఓవర్లలో 66 పరుగులతో శుభారంభం ఇచ్చింది. 66 పరుగుల వద్ద జాసన్ రాయ్ వికెట్ పడటంతో వీరిద్దరి పార్టనర్ షిష్ కి బ్రేక్ పడింది. మొదటి వికెట్ కోల్పోయిన బట్లర్ తన జోరును ఆపలేదు. వరుస బౌండరీలతో ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. కేవలం 25 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత వచ్చిన జానీ బెయిర్ స్టో కూడా సిక్సర్లు వర్షం కురిపించడంతో టార్గెట్ ను ఈజీగా ఫినిష్ చేసింది ఇంగ్లండ్.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించారు ఇంగ్లండ్ బౌలర్లు. ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకి ఆలౌట్ అయింది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్ ఫించ్ 49 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు, క్రిస్ వోక్స్, టైమల్ మిల్స్ రెండు వికెట్లతో సత్తా చాటారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియాకి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. 1 పరుగు చేసిన డేవిడ్ వార్నర్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంపైర్ అవుట్‌గా ప్రకటించకపోయినా వార్నర్ స్వచ్ఛందంగా పెవిలియన్‌కి చేరుకున్నాడు. 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. ఆ తర్వాతి ఓవర్‌లో 5 బంతుల్లో 1 పరుగు చేసిన స్టీవ్ స్మిత్, క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ బాట పట్టాడు.
ఆ తర్వాత 9 బంతుల్లో 6 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. మ్యాక్స్‌వెల్ రివ్యూకి వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ 4 బంతుల్లో డకౌట్ అయ్యాడు. అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు స్టోయినిస్. దీంతో 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా.
ఆ తర్వాత 18 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన మాథ్యూ వేడ్, లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో జాసన్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ దశలో ఆరోన్ ఫించ్, ఆస్టన్ అగర్ కలిసి ఆరో వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో స్టార్క్, కమిన్స్ మెరుపులు మెరిపించారు. అయినా, ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది.