టీ20 ప్రపంచకప్-2021 నుంచి భారత జట్టు విజయంతో వీడ్కోలు పలికింది. సోమవారం జరిగిన సూపర్-12 దశలో తమ చివరి మ్యాచ్‌లో నమీబియా (IND vs NAM)ని 9 వికెట్ల తేడాతో ఓడించింది. నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. లక్ష్యాన్ని భారత్ 15.2 ఓవర్లలో 1 వికెట్ నష్టపోయి ఛేదించింది. రోహిత్ శర్మ 56 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి 86 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని కూడా చేశాడు. రాహుల్ బౌండరీ కొట్టి 36 బంతుల్లో 54 పరుగులతో నాటౌట్ గా వెనుదిరిగాడు. భారత్ తరఫున రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా 3 వికెట్ల చొప్పున తీశారు. రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
అంతకుముందు జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ల మ్యాజిక్‌తో భారత్ నమీబియాను 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితం చేసింది. జడేజా 16 పరుగులకు 3 వికెట్లు తీయగా, అశ్విన్ 20 పరుగులకు 3 వికెట్లు పడగొట్టడంతో నమీబియా జట్టు నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోయింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. నమీబియా తరఫున డేవిడ్ వైసీ (26), ఓపెనర్ స్టీఫెన్ బార్డ్ (21) మాత్రమే 20 పరుగుల మార్కును దాటగలిగారు. అయితే, భారత్ కూడా 17 అదనపు పరుగులు ఇవ్వడంతో నమీబియా జట్టు గౌరవప్రదమైన స్కోరును చేరుకుంది.
ఇదిలా ఉంటే టీ20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పేశారు. వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లీ ఇదివరకే ప్రకటించారు. మొత్తం 50 టీ20 మ్యాచ్‌లకు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించారు. 31 మ్యాచుల్లో టీమ్ ఇండియాను గెలిపించారు. కోహ్లీ సారధ్యంలో 16 మ్యాచుల్లో జట్టు ఓటమి పాలైంది. దుబాయ్‌లో నమీబియాతో ఇవాళ జరిగిన మ్యాచ్‌ను గెలుపుతో ముగించారు.