మీరు ఇండియా ఆడే క్రికెట్ మ్యాచులు చూస్తే స్టేడియంలోని గ్యాలరీలో ఓ వ్యక్తి తన శరీరమంతా మూడు రంగులతో (tri color) పెయింట్ చేసుకొని ఛాతీపై Miss-U Tendulkar 10 అని రాసుకొని, నుదిటిపై భారతదేశ తిలకాన్ని దిద్దుకొని ఒక చేతితో శంఖాన్ని పూరిస్తూ, మరో చేతితో జాతీయ జెండాను ఊపుతూ, స్టేడియంలోని ప్రేక్షకులను, మైదానంలో భారత ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ ఉంటాడు. అతడే సుధీర్ కుమార్ చౌధరీ అలియాస్ సుధీర్ కుమార్ గౌతమ్ (Sudhir Kumar Gautam).

2019 నాటికి 38 ఏళ్ల వయస్సున్న సుధీర్ క్రికెట్ దేవుడు (God of Cricket) మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కు వీరభక్తుడు, భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) కు వీరాభిమాని. భారత క్రికెట్ మ్యాచ్ జరిగే ఏ వేదికైనా, ఏ దేశమైనా అది ఎలాంటి ఫార్మాట్ లో జరిగే మ్యాచ్ అయినా, దాదాపు ప్రతీ మ్యాచ్ కు సుధీర్ హాజరవుతాడు, దేశ ప్రజలందరి తరఫున భారతజట్టుపై తన అభిమానాన్ని చాటుతాడు.

బిహార్ రాష్ట్రం, ముజఫర్ పూర్ లోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన సుధీర్ కు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే మహాపిచ్చి. ఆడటం అంటే కాదు, చూడటం అంటే. తన 6వ ఏట నుంచే టీవీల్లో క్రికెట్ మ్యాచులు చూడటానికి చాలా ఇష్టపడేవాడు. అదే క్రమంలో సచిన్ పై తన అభిమానాన్ని పెంచుకుంటూపోయాడు. తన 14వ ఏట చదువులకు గుడ్ బై చెప్పేసి, పాల వ్యాపారం చేసుకునేవాడు. డబ్బు పోగు చేసుకుని క్రికెట్ మ్యాచ్ లు చూడటం మొదలుపెట్టాడు. తన దగ్గరున్న ప్రతీపైసా టీమిండియా తర్వాత మ్యాచ్ చూడటం కోసమే ఖర్చుపెట్టేవాడు, సుధీర్ ప్రవర్తన పట్ల తీవ్రఅసంతృప్తి ప్రదర్శించిన తల్లిదండ్రులకు, తన జీవితం భారతజట్టుకు, ప్రజలను ఉత్సాహపరచటానికే అంకితం అని, అలాకాకుండా తనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే చావు తప్ప తనకు మరో మార్గం లేదని తెగేసి చెప్పాడు.

తనకు 22 ఏళ్ల వయస్సు (2003) నుంచి అతడు భారత జట్టు ఆడే ప్రతీ మ్యాచ్ ను స్టేడియంకి వెళ్లి చూడటం మొదలుపెట్టాడు. ఎంత దూరమైన సైకిల్ తొక్కుకుంటూ వెళ్లేవాడు, కొన్నిసార్లు టికెట్ లేకుండా ప్రయాణం చేసేవాడు, మరికొన్ని సార్లు మ్యాచ్ చూసేందుకు విరాళాలు సేకరించేవాడు. ఒకసారి సచిన్ ఆట చూసేందుకు బిహార్ నుంచి ముంబై వరకు 21 రోజులు సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు.

2010లో ఒకసారి ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో సచిన్ తో షేక్ హ్యాండ్ తీసుకునేందుకు సాహసించి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ చేతిలో బాగా తన్నులు తిన్నాడు. ఇది తెలిసిన తర్వాత సచిన్ అతణ్ని విడిపించి ఆ పోలీస్ ఆఫీసర్ చేత క్షమాపణ చెప్పించాడు. ఆ తర్వాత నుంచి సుధీర్ కు భారత్ ఆడే ప్రతీ మ్యాచ్ ను వీక్షించేందుకు అయ్యే ఖర్చులన్నీ సచిన్ మరియు బీసీసీఐ సంయుక్తంగా స్పాన్సర్ చేస్తూ వస్తున్నారు.

2011 లో భారత్ ప్రపంచ కప్ గెలుపు సందర్భంగా టీమ్ ఇండియా చేసుకున్న సంబరాలల్లో సచిన్, సుధీర్ ను కూడా భాగస్వామ్యం చేశాడు, సుధీర్ ను కౌగిలించుకుని అతడి చేతులతో ప్రపంచ కప్ ట్రోఫీని ఎత్తుకునేలా చేశాడు.

ఇది ఒక డైహార్డ్ ఫ్యాన్ ప్రస్థానం. సుధీర్ ఎప్పుడూ ఇలాగే భారత్ జట్టును ఉత్సాహపరుస్తూ తన ప్రయాణం కొనసాగించాలని కోరుకుందాం.