ICC Tournaments- Reserve Day info | Photo Credits: ICC

ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫి లాంటి మెగా టోర్నమెంట్లు నిర్వహిస్తున్నప్పుడు నాకౌట్ స్టేజిలో లేదా విజేతను నిర్ణయించే ఏదైనా కీలక మ్యాచ్ జరుగుతున్నప్పుడు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడి ఆట మధ్యలోనే నిలిచిపోతే, ఎవరో ఒకరిని విజేతగా ప్రకటించకుండా, రెండు జట్ల మధ్య న్యాయమైన ఆట (fair play) జరగటానికి అవకాశం కల్పిస్తూ ఆటను రిజర్వ్ డేకు (Reserve Day) పోస్ట్‌పోన్ చేస్తారు.

ఈ రిజర్వ్ డే అనేది ఒక కీలక మ్యాచ్ కోసం అదనపు రోజు కేటాయించడం అన్నమాట. ఏదైనా మెగా టోర్ని ప్రారంభానికి ముందే అన్ని మ్యాచ్‌ల షెడ్యూల్‌లో భాగంగానే ఇవి కూడా షెడ్యూల్ చేయబడి ఉంటాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయా తేదీల్లో జరగాల్సిన మ్యాచ్‌లకు ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి మ్యాచ్ నిలిచిపోతే ఈ రిజర్వ్ డే ఉపయోగపడుతుంది. కాబట్టి టికెట్ కొనుకున్న ప్రేక్షకులు అదే టికెట్‌తో ఈ మ్యాచ్‌కు హాజరుకావొచ్చు.

అంతకుముందు మ్యాచ్ సరిగ్గా ఎక్కడైతే నిలిచిపోయిందో తిరిగి అక్కడి నుంచే కొనసాగిస్తూ పూర్తి స్థాయి మ్యాచ్‌ను రిజర్వ్ డే లో ఆడిస్తారు.

రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే అప్పుడు ఓవర్లను కుదించి మళ్ళీ DLS (డక్ వర్త్ లూయిస్) పద్ధతి ప్రకారం ఆటలో మార్పులు చేస్తారు.

ఈ రిజర్వ్ డే లో జరిగే మ్యాచ్ వేదికలో కానీ, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో గానీ ఎలాంటి మార్పులు ఉండవు. ఏ మైదానంలో అయితే మ్యాచ్ ఆగిపోయిందో తిరిగి అదే మైదానంలో ఆట కొనసాగించాలి. సాధారణంగా అంతకుముందు మ్యాచ్ ఏ సమయానికి ప్రారంభమైందో తిరిగి అదే సమయానికి ఆటను ప్రారంభించాల్సి ఉంటుంది.

ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా అస్సలు మ్యాచ్ జరిగే అవకాశం లేనప్పుడు టోర్నమెంట్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టును నాకౌట్ స్టేజ్ నుంచి నేరుగా ఫైనల్ చేరుస్తారు.

ఇదే పరిస్థితి ఫైనల్లో తలెత్తితే? ఒకవేళ ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఏదైనా అంతరాయం ఏర్పడి ఆట రిజర్వ్ డేకు పోస్ట్‌పోన్ చేయబడింది అనుకుందాం. అప్పుడు రిజర్వ్ డేలో ఈ ఫైనల్ మ్యాచ్ ఆగిపోయిన దగ్గర్నించి తిరిగి పున: ప్రారంభం అవుతుంది. అయితే రిజర్వ్ డేలో జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా రద్దు కావాల్సి వస్తే ఇక చేసేదేం ఉండదు ఫైనల్స్‌లో ఆడిన రెండు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు. ఇరు జట్లు కలిసి సంయుక్తంగా ట్రోఫి అందుకోవలసి ఉంటుంది.