Hyderabad, December 06: ఇండియా మరియు వెస్టిండీస్ (India vs West Indies) మధ్య మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యమిస్తుంది. ఇందులో భాగంగా భారత్ మరియు వెస్టిండీస్ మధ్య తొలి టీ20 (1st T20) మ్యాచ్ ఈరోజు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (ఉప్పల్) స్టేడియం (Rajiv Gandhi International Cricket Stadium) లో జరగనుంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. వరుస సిరీస్ విజయాలతో దూకుడు మీద ఉన్న కోహ్లీ సేన ఈ సిరీస్ పైనా కన్నేసింది. ఇక పోలార్డ్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టు కూడా పటిష్ఠంగా ఉంది, మామూలుగానే విండీస్ జట్టులో అందరూ హార్డ్ హిట్టర్స్ ఉంటారు. ఇండియాలో జరిగే మ్యాచ్‌లలో ఐపీఎల్ అనుభవం కలిసి వస్తుంది. అయితే గత ప్రపంచ కప్ తర్వాత వెస్టిండీస్‌లో పర్యటించిన టీమిండియా, విండీస్‌పై టీ20, వన్డే మరియు టెస్ట్ సిరీస్‌లు అన్నింటినీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విండీస్ జట్టు కూడా భారత్‌పై ప్రతీకారం తీసుకోవాలని భావిస్తుంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ జరగటం ఖాయంగా కనిపిస్తుంది.
కాగా, తొలిసారిగా మ్యాచ్‌లో నోబాల్స్ (No-balls)ను థర్డ్ అంపైర్ ప్రకటించనున్నారు. ఫీల్డ్ అంపైర్ బౌలర్ ఫ్రంట్ ఫుట్ ఇక పట్టించుకోడు, ఆ బాధ్యతంతా టీవీ అంపైర్ పైనే ఉంటుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
బ్లాక్ డే రోజు మ్యాచ్, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిన సిటీ పోలీస్
ఇక కొత్తగా ఎన్నికైన హెచ్‌సీఎ (Hyderabad Cricket Association) నేతృత్వంలో హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్ ఇది. సుమారు 40 వేల మంది ప్రేక్షకులు స్టేడియంకు తరలి రావొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే డిసెంబర్ 6 బ్లాక్ డే (Black Day) నేపథ్యంలో నగరవ్యాప్తంగా భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు చెప్తున్నారు. మ్యాచ్ కూడా ఉండటంతో ఆంక్షలు కూడా విధించారు. స్టేడియం పరిసరాలలో సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని, మొత్తం 1800 మంది పోలీసులతో మ్యాచ్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమీషనర్ మహేశ్ భగవత్ (CP Mahesh Bhagavath) తెలిపారు.
సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, సాయంత్రం 4 గంటలకే స్టేడియం గేట్లు తెరుచుకుంటాయి, స్టేడియంలోకి ప్రవేశించిన తర్వాత వారిని బయటకు వెళ్లడానికి అనుమతించరు. జాతీయ జెండాలను తప్ప మరే ఇతర జెండాలను అనుమతించరు. అలాగే స్టేడియానికి ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, బ్యానర్లు, సిగరెట్లు, అగ్గిపెట్టెలు, హెల్మెట్లు, బ్యాటరీలు, బ్యాగులు, వాటర్ బాటిళ్లతో సహా ఎలాంటి ఆహార పదార్థాలను కూడా లోపలికి అనుమతించబోమని సీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. ఎలాంటి సమస్య వచ్చినా 100కి కాల్ చేయాల్సిందిగా సీపీ సూచించారు.
ఇక పోలీసుల సూచనలు పాటించి మ్యాచ్ సజావుగా సాగేలా సహకరించాలని ప్రేక్షకులకు హెచ్‌సీఎ (HCA) అధ్యక్షుడు అజరుద్దీన్ (Azaruddin) విజ్ఞప్తి చేశారు. ఇలాంటి మ్యాచ్‌లు విజయవంతంగా నిర్వహిండం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.