Newdelhi, October 23: ప్రపంచవ్యాప్తంగా (Worldwide) క్రికెట్ అభిమానులు (Cricket Fans) ఆశగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. మరికొన్ని గంటల్లో దాయాదుల మధ్య పోరు జరగనుంది. ఆసియాకప్ (AsiaCup) తర్వాత ఈ రెండు జట్లు తొలిసారి పోటీపడుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ (India-Paksitan) జట్ల మధ్య పోరంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులందరూ అటెన్షన్‌లోకి వెళ్లిపోతారు. ఈ మ్యాచ్‌లో గెలుపోటములకంటే అది పంచే మజాపైనే అభిమానులు ఎక్కువగా దృష్టిసారిస్తారు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఉన్న రికార్డు మరే దేశానికి లేదు. వన్డే ప్రపంచకప్‌లో ఏడుసార్లు, టీ20 ప్రపంచకప్‌లో ఐదుసార్లు పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. ఆ రికార్డును కాపాడుకోవాలని పట్టుదలగా ఉండగా, నేటి మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా ఆ రికార్డును బద్దలుగొట్టాలని బాబర్ ఆజం సేన కసిగా ఉంది.
గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో దారుణంగా ఓటమి పాలైన భారత్.. ప్రతికారేచ్ఛతో రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ పూర్తి ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఆసియాకప్‌లోనూ భారత్‌ను ఒకసారి చిత్తు చేసిన పాకిస్థాన్ నేటి మ్యాచ్‌లోనూ అదే ఊపు కొనసాగించాలని పథకం వేసింది. గతంతో పోలిస్తే పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్ఠంగా ఉంది. కాబట్టి నేటి మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్ ఓ ప్రణాళిక ప్రకారం ఆడాల్సి ఉంటుంది. అలాగే, గత కొంతకాలంగా పరుగులు చేయడంలో విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ ఝళిపించాల్సి ఉంటుంది.