
మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఘనంగా బోణీ కొట్టిన భారత జట్టుకు.. రెండో మ్యాచ్‌లో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో (ICC Women’s World Cup 2022) మిథాలీ బృందం 62 పరుగుల తేడాతో (India Surrender to New Zealand by 62 Runs) న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అమీ సాటర్‌వైట్ (75; 9 ఫోర్లు), అమెలియా కెర్ (50; 5 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. మన బౌలర్లలో పూజ వస్ర్తాకర్ నాలుగు, రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా 46.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (63 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా.. కెప్టెన్ మిథాలీ రాజ్ (31), యస్తిక భాటియా (28) ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో లియా తహుహూ, అమెలియా కెర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. స్టార్ ఓపెనర్ స్మృతి మందన, దీప్తి శర్మ, రిచా ఘోష్, పూజ వస్ర్తాకర్, స్నేహ్ రాణా బ్యాటింగ్‌లో విఫలం కావడం భారత అవకాశాలను దెబ్బతీసింది.
సాటర్‌వైట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. తదుపరి పోరులో శనివారం వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఎనిమిది జట్ల మధ్య జరుగుతున్న ఈ మెగాటోర్నీలో ప్రస్తుతం 2 పాయింట్లు ఖాతాలో ఉన్న మిథాలీ బృందం ఐదో స్థానానికి పడిపోయింది.