India vs England 1st Test : Image Credit: Social Media

Vishakhapatnam, FEB 05: భారత్ -ఇంగ్లండ్ జట్ల (IND Vs ENG) మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ (2nd Test) మ్యాచ్ విశాఖ పట్టణం వేదికగా జరుగుతుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు (England Team).. రెండో మ్యా చ్ లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. భారత్ జట్టు (Team India) మూడోరోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ 255కు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ కు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి ఇంగ్లండ్ జట్టు 67 పరుగులు చేసింది. ఇంకా ఆట రెండు రోజులు మిగిలి ఉంది.. ఇంగ్లండ్ చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. ఇంకా 332 పరుగులు చేయాల్సి ఉంది. పదునైన బంతులతో విరుచుకుపడుతున్న భారత్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బౌలర్లు ఎంతసేపు క్రీజులో పాతుకుపోతారనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది.

 

కానీ, ఒకవేళ ఇంగ్లండ్ జట్టు లక్ష్యాన్ని చేధిస్తే చరిత్ర సృష్టించడం ఖాయం. భారత్ గడ్డపై 387 పరుగుల కంటే ఎక్కువ ఛేజింగ్ ను ఏ జట్టు సాధించలేదు. భారత్ గడ్డపై టెస్టు మ్యాచ్ లలో 387 పరుగులు అత్యధిక ఛేజింగ్ లక్ష్యం. 2008లో ఇంగ్లండ్ (England) తో జరిగిన చెన్నై టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టు 387 పరుగుల లక్ష్యాన్ని ఛేధించింది. ఆ మ్యాచ్ లో బాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీ చేయడంతో భారత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

 

భారత్ గడ్డపై ఇప్పటి వరకు ఏ విదేశీ జట్టుకూడా 300 పరుగులకుపైగా లక్ష్యాన్ని ఛేదించలేదు. మరోవైపు టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లండ్ జట్టు అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించింది భారత్ జట్టుపైనే. 2022లో బర్మింగ్ హోం టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ గడ్డపై ఇంగ్లండ్ జట్టు 1972 ఢిల్లీ టెస్టులో 207 లక్ష్యాన్ని ఛేదించింది. ఇదే.. ఆ జట్టుకు భారత్ పై అత్యధిక పరుగుల ఛేదన విజయం.

భారత గడ్డపై టెస్టుల్లో టాప్ -10 పరుగుల ఛేజింగ్ లు

387 పరుగులు – భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (2008 -చెన్నై)

276 పరుగులు – వెస్టిండీస్ వర్సెస్ ఇండియా (1987- ఢిల్లీ)

276 పరుగులు – ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (2011- ఢిల్లీ)

261 పరుగులు – ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (2012 – బెంగళూరు)

254 పరుగులు – ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (ముంబై)

219 పరుగులు – ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( 2010 -మొహాలీ)

207 పరుగులు – ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ (1972 – ఢిల్లీ)

207 పరుగులు – భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (2010 – బెంగళూరు)

203 పరుగులు – భారత్ వర్సెస్ పాకిస్థాన్ (2007 – ఢిల్లీ)

194 పరుగులు – ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ (1998 – బెంగళూరు)