New Delhi, OCT 11: వన్డే ప్రపంచకప్ టోర్నీలో (ICC World Cup) భాగంగా బుధవారం భారత్-అఫ్ఘానిస్థాన్ (IND Vs AFG) క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2:00 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్టీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి మాంచి ఊపు మీదుండగా.. తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైన అఫ్ఘాన్ టీమ్ భారత్‌పై సంచలనం నమోదు చేయాలని భావిస్తోంది. కాగా, ఈ ప్రపంచకప్‌లో (World Cup) ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి. ఇవాళ జరిగేది 9వ మ్యాచ్. ఆడిన రెండేసి మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు నాలుగేసి పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో తొలి రెండు స్థానాలను ఆక్రమించాయి. భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి రెండేసి పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్, బంగ్లాదేశ్ టీమ్‌లు ఒక్కో విజయం, ఒక్కో ఓటమితో రెండేసి పాయింట్లు సాధించి ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్ ఆడిన ఒక్కో మ్యాచ్ ఓడిపోయి.. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఓడిపోయి ఇంకా ఖాతా తెరువలేదు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్ తో పాటు స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది. భారత్ మొదటి బ్యాటింగ్ చేస్తే పరుగుల వరద ఖాయం. ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు ఆఫ్గానిస్థాన్ తో ఒక్కసారి మాత్రమే తలపడింది. ఈ మ్యాచ్ లో భారత్ (Team India) విజయం సాధించింది. వన్డే ఫార్మాట్ లో కూడా టీమిండియా రెండు మ్యాచ్ లు ఆఫ్గానిస్థాన్ ను ఓడించగా.. ఒక మ్యాచ్ టై అయింది.
ఇండియా వర్సెస్ ఆఫ్గానిస్థాన్ మ్యాచ్ అనగానే.. క్రికెట్ అభిమానులకు ముందుగా గుర్తుకొచ్చేది కోహ్లీ(Kohli), నవీన్ ఉల్ హక్. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో వీరిద్దరి మధ్య పెద్ద వివాదమే జరిగింది. అప్పటి నుంచి ఆఫ్గాన్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్ ను కోహ్లీ ఫ్యాన్స్ ఓ ఆటాడుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ సమయంలో నవీన్ ఉల్ హుక్ బౌలింగ్ వేస్తే.. వారిద్దరి హావభావాలు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), ఇషాంత్ కిషన్ డకౌట్ అయ్యారు. వీరితోపాటు సెకండ్ డౌన్ బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయస్ సైతం డకౌట్ అయ్యారు. కోహ్లీ, రాహుల్ (KL Rahul) క్రీజులో నిలవకపోయిఉంటే ఆసీస్ చేతిలో టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చేంది. ఈనెల 14న పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత్ జట్టుకు ప్రతిష్టాత్మకం. వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్ జట్టుపై భారత్ ఎప్పుడూ ఓడిపోలేదు. ఆ రికార్డును భారత్ జట్టు నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు ఆఫ్గానిస్థాన్ తో మ్యాచ్ జరుగుతుండటం భారత్ జట్టుకు కొంత ఊరటనిచ్చే అంశమే. ఎందుకంటే.. ఈ మ్యాచ్ ద్వారా గత మ్యాచ్ లో విఫలమైన బ్యాటర్లు ఫామ్ లోకి రావటానికి మంచి అవకాశం. ఈ మ్యాచ్ లో రోహిత్, ఇషాన్ కిషన్ లు క్రీజులో ఎక్కువ సేపు నిలబడితే భారత్ జట్టు భారీ స్కోర్ సాధించటం ఖాయమే.