Ind vs NZ 3rd T20I: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం, సిరీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్,
(Image: Twitter)

India vs New Zealand :  మూడు టీ20 సిరీస్‌ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. దీంతో మూడు టీ 20 మ్యాచుల సిరీస్ ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మూడో టీ 20లో  73 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 185 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ సాధించలేకపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి భారత్ 184 పరుగులు చేసింది. 17.2 ఓవర్లలో న్యూజిలాండ్  111 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

మ్యాచ్ ఆరంభంలోనే న్యూజిలాండ్ తడబడింది. బౌలర్ అక్సర్ పటేల్ తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌కు షాకిచ్చాడు. 21 పరుగుల వద్ద ఓపెనర్ డరిల్ మిచెల్ (5).. అక్సర్ పటేల్ బౌలింగులో హర్షల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మార్క్ చాప్‌మన్ డకౌట్ అయ్యాడు. 10.3 ఓవర్ల వద్ద న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. మార్టిన్ గుప్టిల్ 36 బంతుల్లో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. 4.4 ఓవర్ల వద్ద న్యూజిలాండ్ 30 పరుగులు చేసి మూడో వికెట్ కోల్పోయింది. అక్సర్ పటేల్ వేసిన నాలుగు బంతులను ఎదుర్కొని గ్లెన్ ఫిలిప్స్ ఒక పరుగు కూడా చేయకుండా ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి మార్టిన్ గుప్టిల్ ఔటయ్యాడు.

ఇదిలా ఉంటే ముందుగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ముందు 185 పరుగుల టార్గెట్ ఉంచింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 29, శ్రేయస్ అయ్యర్ 25, వెంకటేశ్ అయ్యర్ 20, దీపక్ చాహర్ 21, హర్షల్ పటేల్ 18 పరుగులు చేశారు. చివర్లో దీపక్ చాహర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 8 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు.