australia vs india

Vizag, NOV 23: వన్డే ప్రపంచకప్‌ (CWC-23) ఇలా అయిపోయిందో లేదో అప్పుడే మరో సిరీస్‌ అభిమానుల ముందుకు వచ్చేసింది. మెగాటోర్నీ ముగిసి మూడు రోజులైనా కాకముందే భారత్‌, ఆస్ట్రేలియా మరోమారు మైదానంలో తలపడబోతున్నాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం భారత్‌, ఆసీస్‌ మధ్య మొదటి మ్యాచ్‌కు విశాఖ ఆతిథ్యమిస్తున్నది. వరల్డ్‌కప్‌ హీరోలు రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీ, గిల్‌, అయ్యర్‌, రాహుల్‌, షమీ, సిరాజ్‌, బుమ్రా లేకుండానే టీమ్‌ఇండియా బరిలోకి దిగుతున్నది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గైర్హాజరీలో సూర్యకుమార్‌యాదవ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది వెస్టిండీస్‌, అమెరికా వేదికలుగా జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత్‌ యువ జట్టుతో సిద్ధమవుతున్నది. ఇటీవల సిరీస్‌లో సెలెక్టర్లు సీనియర్లను తప్పిస్తూ ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన యువకులకు జాతీయజట్టులో చోటు కల్పిస్తున్నారు. మెగాటోర్నీ నాటికి టీమ్‌ఇండియా 11 టీ20 మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న వనరుల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశముంది. ముఖ్యంగా వన్డే జట్టుకు భిన్నంగా ప్రస్తుత టీ20 టీమ్‌లో ఎడమచేతి వాటం ప్లేయర్లు బాగా ఉన్నారు.

 

ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌వర్మ, రింకూసింగ్‌, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఉన్నారు. రెగ్యులర్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ కొనసాగనుండగా, రిజర్వ్‌గా జితేశ్‌శర్మను ఎంపిక చేశారు. యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది. బౌలింగ్‌ విషయానికొస్తే..అర్ష్‌దీప్‌సింగ్‌, అవేశ్‌ఖాన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, ముఖేశ్‌కుమార్‌తో బలంగా కనిపిస్తున్నది. చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్‌ అయ్యర్‌ జట్టుతో కలువనున్నాడు. హైదరాబాదీ క్రికెట్‌ దిగ్గజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రస్తుతం టీమ్‌ఇండియాకు చీఫ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

వన్డే ప్రపంచకప్‌ గెలిచిన ఆసీస్‌ మంచి జోరు మీదుంది. మెగాటోర్నీ గెలిచిన జట్టులో సభ్యులైన స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, మ్యాక్స్‌వెల్‌, స్టొయినిస్‌, జంపా ఉండటం ఆసీస్‌కు కలిసిరానుంది. తమదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా చిత్తుచేయడంలో కంగారూలు ముందుంటారు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అందుకు నిదర్శనమని చెప్పొచ్చు. వైజాగ్‌లో గెలువడం ద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టాలని ఆసీస్‌ చూస్తున్నది. అనుభవం లేని భారత క్రికెటర్లకు, ఆసీస్‌కు మధ్య పోరు ఆసక్తికరంగా జరిగే అవకాశముంది.

భారత్‌: ఇషాన్‌కిషన్‌, రుతురాజ్‌, సూర్యకుమార్‌(కెప్టెన్‌), తిలక్‌వర్మ, శివమ్‌దూబే, రింకూసింగ్‌, అక్షర్‌పటేల్‌/సుందర్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌సింగ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ/అవేశ్‌ఖాన్‌, ముకేశ్‌కుమార్‌.

ఆస్ట్రేలియా: స్మిత్‌, షార్ట్‌, హార్డీ, ఇంగ్లిస్‌, స్టొయినిస్‌, డేవిడ్‌, వేడ్‌(కెప్టెన్‌), అబాట్‌, ఎలిస్‌, బెహెన్‌డార్ఫ్‌, సంగా