దక్షిణాఫ్రికా, డిసెంబర్ 30: సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. (India vs South Africa) మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కేఎల్ రాహుల్ సూపర్ శతకంతో రాణించగా.. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అర్థ శతకం.. రహానే 48 పరుగుల కీలక ఇన్నింగ్స్ వెరసి తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఐదు వికెట్లతో దుమ్మురేపడం.. అతనికి బుమ్రా, సిరాజ్, శార్దూల్ నుంచి సహకారం అందడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు 131 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్ తడబడడంతో 174 పరుగులకే కుప్పకూలింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని సౌతాఫ్రికా ఎదుట 305 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. అయితే సెంచూరియన్ మైదానంలో 200 కంటే ఎక్కువ పరుగులు చేధించిన సందర్భాలు లేవు. దీనిని టీమిండియా చక్కగా వినియోగించుకుంది. భారత పేసర్లు షమీ, బుమ్రా, సిరాజ్‌లు చెలరేగడం.. చివర్లో అశ్విన్ వరుసగా రెండు వికెట్లు తీయడంతో టీమిండియా ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో టీమిండియా సౌతాఫ్రికా గడ్డపై పలు రికార్డులు అందుకుంది.