Guwahathi, OCT 02: భారత్‌తో (India) జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా ( South Africa) జట్టు పోరాడి ఓడింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. సఫారీ బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar yadav) (61), కేఎల్ రాహుల్ (KL Rahul) (57), విరాట్ కోహ్లీ (Virat kohli) (49 నాటౌట్) రాణించారు. దీంతో భారత జట్టు 237/3 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో సఫారీ బ్యాటర్లు తడబడ్డారు. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (0), రైలీ రూసో (0) ఇద్దరూ రెండో ఓవర్లోనే డకౌట్లుగా పెవిలియన్ చేరారు. ఆ తర్వాత కాసేపు ధాటిగా ఆడిన ఎయిడెన్ మార్క్రమ్ (33)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇలాంటి సమయంలో క్వింటన్ డీకాక్ (69 నాటౌట్)కు జత కలిసిన డేవిడ్ మిల్లర్ (David miller) (47 బంతుల్లో 106 నాటౌట్) ఆ జట్టును గెలిపించినంత పనిచేశాడు.
2ND T20I. India Won by 16 Run(s) https://t.co/R73i6Rr0O2 #INDvSA @mastercardindia
— BCCI (@BCCI) October 2, 2022
అయితే భారత బౌలర్లు కొంత కట్టడి చేయడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో సఫారీ జట్టు 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. స్వదేశంలో సౌతాఫ్రికాపై భారత్ (IND Vs SA) గెలిచిన తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం.
అంతేకాదు, స్వదేశంలో వరుసగా అత్యధిక సిరీస్‌లు గెలిచిన జట్టుగా కూడా భారత్ రికార్డు సృష్టించింది. స్వదేశంలో ఇది భారత్‌కు వరుసగా 10వ సిరీస్ విజయం. ఆ తర్వాత 7 సిరీస్ విజయాలతో ఆసీస్ రెండో స్థానంలో ఉంది.