Indore, November 15: భారత్ మరియు బంగ్లాదేశ్ (India vs Bangladesh) మధ్య ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ తేడాతో సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్, ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగి తొలి ఇన్నింగ్స్‌లో 493/6 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 343 భారీ ఆధిక్యం లభించింది.
ఇక మూడో రోజు ఆట ప్రారంభం కాగానే కెప్టెన్ కోహ్లీ అనూహ్యంగా భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే బంగ్లా బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ భారత బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. ఇషాంత్, ఉమేష్, షమీల బౌలింగ్ ధాటికి బంగ్లా టాప్ ఆర్డర్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ఈ దశలో ముష్ఫికర్ రహీమ్ ఒక్కడే 64 పరుగులతో బంగ్లాదేశ్‌కు గౌరవ ప్రదమైన స్కోర్ దక్కడంలో సహాయపడ్డాడు. చివర్లో లిటన్ దాస్ 35 మరియు మెహ్దీ హసన్ 38 పరుగులతో రాణించారు. ఫలితంగా బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 69.2 ఓవర్లలో 213 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 130 పరుగులు మరియు ఒక ఇన్నింగ్స్ తేడాతో తొలి టెస్టును ఖాతాలో వేసుకుంది.
మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఒపెనింగ్ బ్యాట్స్ మెన్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) బంగ్లా బౌలర్లను ఉతికారేశాడు. 28 ఫోర్లు, 8 సిక్సర్లతో 243 పరుగులు చేశాడు. ఇది మయాంక్ కెరియర్‌లో రెండవ డబుల్ సెంచరీ. రోహిత్ శర్మ 6, కెప్టెన్ కోహ్లీ డకౌట్ తో నిరాశపరిచినా, అజింక్యా రహానే 86, ఛతేశ్వర్ పూజారా 54, రవీంద్ర జడేజా 60 నాటౌట్ పరుగులు చేశారు.
243 పరుగులతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మయాంక్ అగర్వాల్‌కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ (Man of The Match) అవార్డు దక్కింది.
స్కోర్ వివరాలు ఇలా ఉన్నాయి:
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 150 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 493/6 డిక్లేర్డ్
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 213 ఆలౌట్
ఈ విజయంతో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో నిలిచింది. భారత్ మరియు బంగ్లాదేశ్ రెండో టెస్ట్ ఈనెల 22 నుంచి కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనుంది. కాగా, రెండో టెస్ట్ డే-నైట్ మ్యాచ్ కావడంతో ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ పట్ల క్రికెట్ అభిమానులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇందులో మ్యాచ్‌లో గులాబీ బంతిని వినియోగించనున్నారు.