Harare, July 10: జింబాబ్వే (Zimbabwe) పర్యటనలో యువ భారత్ (India) వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆతిథ్య జట్టుతో హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో (IND vs ZIM 3rd T20I) 23 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 159-6 వద్దే ఆగిపోయింది. ఆ జట్టులో డియోన్ మైయర్స్ (49 బంతుల్లో 65 నాటౌట్, 7 ఫోర్లు, 1 సిక్సర్), క్లైవ్ మదండె (26 బంతుల్లో 37, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (3-15), అవేశ్ ఖాన్ (2-39) రాణించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1తో ముందంజ వేసింది. వాషింగ్టన్ సుందర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. భారీ ఛేదనలో జింబాబ్వేకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. అవేశ్ ఖాన్ వేసిన ఆ ఓవర్లో ఓపెనర్ వెస్లీ మద్వెరె (1) అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. మరుమని (13)ని ఖలీల్ అహ్మద్ 3వ ఓవర్లో పెవిలియన్‌కు పంపాడు. ప్రమాదకర బ్రియాన్ బెన్నెట్ (4)ను అవేశ్ ఖాన్ ఔట్ చేయగా కెప్టెన్ సికందర్ రజా (15) మరోసారి విఫలమయ్యాడు. జొనాథన్ క్యాంప్‌బెల్ (1) నిరాశపరిచాడు. ఈ రెండు వికెట్లూ సుందర్ ఖాతాలోకే వెళ్లాయి. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే 7 ఓవర్లకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
3RD T20I. India Won by 23 Run(s) https://t.co/FiBMpdZo0K #ZIMvIND
— BCCI (@BCCI) July 10, 2024
39 పరుగులకే 5 వికెట్లు నష్టపోయిన జింబాబ్వేను మైయర్స్, క్లైవ్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ భారత బౌలర్లను సమర్థంగా అడ్డుకున్నారు. వేగంగా ఆడకపోయినా వికెట్లను కాపాడుకున్నారు. ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించిన ఈ జోడీని ఎట్టకేలకు సుందర్ విడదీశాడు. 17వ ఓవర్లో క్లైవ్ రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత జింబాబ్వే బ్యాటర్ల పోరాటం ఆ జట్టు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
అంతకుముందు ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (66), రుతురాజ్ గైక్వాడ్ (49), యశస్వీ జైస్వాల్ (36) రాణించారు. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 ఈనెల 13న (శనివారం) ఇదే వేదికపై జరుగనుంది.