India vs Nepal: ఆసియా క‌ప్ లో సెమీస్ కు చేరిన‌ టీమిండియా ఉమెన్స్, చివ‌రి లీగ్ మ్యాచ్ లో ఘ‌న‌ విజ‌యం, మెరిసిన షెఫాలి

మహిళల టీ20 ఆసియాకప్‌ (Womens Asia Cup T20) మెగా టోర్నీలో భాగంగా నేపాల్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. 82 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయకేతనం ఎగుర వేసింది. 179 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులకే పరిమితమైంది.

India vs Nepal: ఆసియా క‌ప్ లో సెమీస్ కు చేరిన‌ టీమిండియా ఉమెన్స్, చివ‌రి లీగ్ మ్యాచ్ లో ఘ‌న‌ విజ‌యం, మెరిసిన షెఫాలి
Shafali Verma

New Delhi, July 23: ప్రత్యర్థి నేపాల్‌ జట్టు భారత్‌కు ఏ పరిస్థితుల్లోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఓపెనర్‌ సీతా రానా మాగర్‌ (18) టాప్‌ స్కోరర్‌. భారత్‌ బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా రధా యాదవ్‌, అరుంధతి రెడ్డి చెరో 2 వికెట్లు, రేణుక సింగ్‌ ఒక వికెట్‌ తీశారు.

 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లలో షెఫాలీ వర్మ (81; 48 బంతుల్లో 12×4, 1×6) అర్ధశతకంతో చెలరేగగా..హేమలత (47; 42 బంతుల్లో 5×4, 1×6) విజృంభించింది. నేపాల్‌ బౌలర్లలో సీతారాన మగర్‌ 2 వికెట్లు పడగొట్టగా.. కబితా జోషి ఒక వికెట్‌ తీసింది.

 

ఇన్నింగ్స్‌ ప్రారంభం నుంచే భారత్‌ బ్యాటర్లు దూకుడు ప్రదర్శించారు. తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్ల సాయంతో 10 పరుగులు రాబట్టారు. ఓ వైపు క్రీజులో నిలదొక్కుకుంటూనే నేపాల్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీల మోత మోగిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. భయంకరంగా మారిన ఈ జోడీని మగర్ విడొగొట్టింది. జట్టు స్కోరు 122 పరుగుల వద్ద రుబీనాకి క్యాచ్‌ ఇచ్చి.. హేమలత పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సజన (10)తో కలిసి షెఫాలీ వర్మ మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లింది. అయితే 15.3వ బంతికి షెఫాలీ స్టంపౌట్‌ అయ్యింది. ఈ వికెట్‌ కూడా మగర్‌కే దక్కింది. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే సజన కూడా కబితా జోషి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. చివర్లో రోడ్రిగ్స్‌ (28*; 15 బంతుల్లో 5×4), రిచా ఘోష్‌ (6; 3 బంతుల్లో 1×4) దూకుడుగా ఆడటంతో.. భారత్‌ భారీ లక్ష్యాన్నే నిర్దేశించింది. తాజా విజయంతో గ్రూప్‌ ఏ నుంచి భారత్‌, పాకిస్థాన్‌ జట్లు సెమీస్‌కు చేరగా.. నేపాల్‌, యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

 

(The above story first appeared on LatestLY on Jul 23, 2024 10:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).