Ind Vs Sa (Image: Twitter)

దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియాకు ఓటమి పాలైంది. మూడో టెస్టులో కోహ్లిసేన(Virat Kohli) 7 వికెట్లతో ఓటమిని చూసింది. భారత్(Team India) విధించిన 212 పరుగుల టార్గెట్‌ను సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది. దీంతో సౌతాఫ్రికాలో(South Africa) సిరీస్ గెలవాలన్న కల నెరవేరకుండానే పోయింది. లక్ష్యచేధనలో సఫారీల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ కీగన్‌ పీటర్సన్‌(82) యాంకర్ రోల్ పోషించగా.. డస్సెన్‌(41 నాటౌట్‌), బవుమా(32 నాటౌట్‌) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ, శార్దుల్ చెరో వికెట్ పడగొట్టారు.

అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 223, రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులు చేసింది. అటు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి టెస్టులో అద్భుతమైన ఆట తీరు కనబరిచి టీమిండియా విజయం సాధించగా.. ఆ తర్వాత రెండో టెస్టు, మూడో టెస్టులో దక్షిణాఫ్రికా పుంజుకుని 2-1తో సిరీస్ దక్కించుకుంది. జట్టు నిండా యువ ప్లేయర్స్ ఉన్నా.. ఎలాంటి అనుభవం లేకపోయినా.. బలమైన టీమిండియా లైనప్‌పై టెస్టు సిరీస్ గెలిచి.. చారిత్రాత్మక విజయాన్ని సఫారీలు అందుకున్నారు. కాగా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, మ్యాచ్ అవార్డులు కీగ్ పీటర్సన్ అందుకున్నాడు. అటు ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 19 నుంచి మొదలు కానుంది.