Team India bags T20 series against WI | Photo: BCCI

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక భారత్ - వెస్టిండీస్ (India vs West Indies) మధ్య జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20 (3rd T20I) లో భారత్ ఘనవిజయం సాధించింది. చివరి మ్యాచ్ లో 67 పరుగుల తేడాతో గెలిచి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా (Team India) 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్ కలిసి అజేయమైన 135 పరుగుల రికార్డ్ ఒపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) 34 బంతుల్లో 71 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ (KL Rahul) 56 బంతుల్లో 91 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు. వీరిద్దరూ ఔట్ అయ్యాక బ్యాటింగ్ కు వచ్చిన రిషభ్ పంత్ భారీ షాట్ కు యత్నించి డకౌట్ గా వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత కసికసిగా వచ్చిన విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి రెచ్చిపోయి ఆడాడు. విరాట్ కేవలం మ్యాచ్ చివరి వరకూ ఉండి కేవలం 29 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్, వెస్టిండీస్ జట్టుకు 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.

ఆ తర్వాత కొండంత లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హిట్మెయర్, కెప్టెన్ పొలార్డ్ (Kieron Pollard ) ఆచుతూచి ఆడుతూనే ధాటిగా సిక్సర్లు బాదడంతో విండీస్ స్కోర్ బోర్డ్ పెరిగింది. హిట్మెయర్ 24 బంతుల్లో 41 పరుగులు చేయగా, భారీ సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడిన పోలార్డ్ కొద్దిసేపు భయపెట్టాడు. అయితే భువీ తెలివైన బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరగడంతో అక్కడే విండీస్ ఇన్నింగ్స్‌కి ఎండ్ కార్డ్ పడినట్లయింది. పొలార్డ్ 39 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇక మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఫలితంగా 20 ఓవర్లలో వెస్టిండీస్ 8 వికెట్లు నష్టపోయి 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 28 సిక్సర్లు, 31 ఫోర్లు నమోదయ్యాయి.

ఇకపోతే, ఈ విజయంతో భారత్ ఖాతాలో మరో టీ20 సిరీస్ వచ్చి చేరింది. ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్ అయిన కేల్ రాహుల్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కగా, కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.

ఇక డిసెంబర్ 15 నుంచి భారత్- విండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది.