IND vs SA: సఫా అయిన సఫారీలు, ఇన్నింగ్స్ తేడాతో మూడో టెస్ట్‌లో భారత్ ఘన విజయం, 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్, ఆల్ రౌండ్ ఆటతీరుతో దుమ్ము రేపిన టీమిండియా
Team India Captain Virat Kohli | Photo- BCCI

Ranchi, October 22: భారత్ మరియు సౌత్ ఆఫ్రికా (India vs South Africa) మధ్య రాంచీ (Ranchi) వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికాను ఇన్నింగ్స్ మరియు 202 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు టెస్టు సిరీస్ లను 3-0 తో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది, ఆడిన మూడు మ్యాచుల్లో ఒక్కటి కూడా గెలవలేక సౌత్ ఆఫ్రికా వైట్ వాష్ అయింది.

ఫాలో ఆన్ ఆడుతూ మంగళవారం ఉదయం 132/8 వద్ద నాలుగో రోజు ఆట ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా కొద్ది కేవలం ఒకేఒక్క పరుగు జోడించి చాప చుట్టేసింది. షాహ్ బాజ్ నదీమ్ (Shahbaz Nadeem) వరుస బంతుల్లో చివరి రెండు వికెట్లు తీయడంతో రెండో ఇన్నింగ్స్ లో 133 పరుగులకే సౌత్ ఆఫ్రికా ఆల్ ఔట్ అయింది. దీంతో భారత్ ఖాతాలో మరో టెస్టుతో పాటు, సిరీస్ వచ్చి చేరింది.

BCCI Tweet 

తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసిన టీమిండియా

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్ లో 497 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భీకర ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో కూడా డబుల్ సెంచరీతో సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఉతికారేశాడు. 212 పరుగులు చేసి రోహిత్ ఔట్ అయ్యాడు. ఛతేశ్వర్ పూజారా 0, కెప్టెన్ విరాట్ కోహ్లి 12 పరుగులు చేసి నిరాశ పరిచారు. అయితే ఆ తర్వాత వచ్చిన అజింక్యా రహానే ధాటిగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు రహానే 115 పరుగులు చేశాడు. ఇటు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా 51 పరుగులు చేసి కత్తి విన్యాసాలు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. చివర్లో బౌలర్ ఉమేశ్ యాదవ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ కే హైలైట్ అని చెప్పవచ్చు. కేవలం 10 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. ఇందులో 5 సిక్సులు ఉన్నాయి, అంటే మొత్తం పరుగులు సిక్సర్ల రూపంలోనే వచ్చాయి.

ఫలితంగా టీమిండియా భారీ స్కోర్ సాధించగలిగింది. భారత్ స్కోర్ 497/9 వద్ద ఉన్నప్పుడు కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేశాడు.

టీమిండియా నిప్పుల్లాంటి బంతులు.. సఫారీలు బెంబేలు

ఇక తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన సౌతాఫ్రికాను ఆదిలోనే ఉమేశ్ యాదవ్ దెబ్బతీశాడు. స్వల్ప వ్యవధిలోనే ఒపెనర్లిద్దరినీ పెవిలియన్ చేర్చాడు. తొలి ఇన్నింగ్స్ లో హంజా 62, లిండే 37 మరియు బవుమా 32 మినహా సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 162 పరుగులకే ఆలౌట్ అయి, ఫాలో ఆన్ ప్రమాదంలో పడింది.

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఫాలో ఆన్ ఆట ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా పరిస్థితి మరో దారుణంగా తయారైంది. క్వింటన్ డీకాక్, డుప్లెసి లాంటి స్టార్ బ్యాట్స్ మెన్ కూడా సింగిల్ డిజిట్లకే చేతులెత్తేశారు. దీంతో వికెట్లన్నీ టపటపా పడిపోయాయి. టెయెలెండర్లు రాణించడంతో 133 పరుగులు చేసి కనీసం పరువు నిలుపుకుంది.

మూడో టెస్టులో స్కోరు వివరాలు ఇలా ఉన్నాయి

భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్: 497/9 డిక్లేర్డ్

టాప్ స్కోరర్స్: రోహిత్ శర్మ 212, అజింక్యా రహానే 115, రవీంద్ర జడేజా 51

సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్: 162/10

టాప్ స్కోరర్స్ : జుబేర్ హంజా 67, జార్జ్ లిండే 37

సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్: 133/10

టాప్ స్కోరర్స్: థియునిస్ డీ బ్రూయిన్ 30

ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీతో పాటు ఆడిన మూడు మ్యాచుల్లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించిన 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. ఈ సిరీస్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ తో సిరీస్ షెడ్యూల్ చేయబడి ఉంది.