London: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ అద్భుతం చేసింది. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌ను భారత బౌలర్లు ఒక్కసారిగా తిప్పేసి విజయతీరాలకు చేర్చారు.రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 120 పరుగులకే పరిమితం చేసి 151 పరుగుల ఘన విజయం అందించారు. ఫలితంగా 5 టెస్టుల సిరీస్‌లో టీంఇండియా 1-0తో ఆధిక్యం సంపాదించింది.
ఇంగ్లండ్ మరియు ఇండియా మధ్య లండన్ లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 364 పరుగులు చేయగా, ప్రతిగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది, అంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టుకు స్వల్పంగా 27 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ నెమ్మదిగా ఆరభించిన భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 181/6 స్కోర్ చేసింది. అంటే ఇంగ్లండ్ పై భారత్ 154 పరుగుల ఆధిక్యం ఉన్నప్పటికీ మిగతా 4 వికెట్లను వెంటవెంటనే ఔట్ చేస్తే ఇంగ్లండ్ స్వల్ప లక్ష్యంతో మ్యాచ్ గెలిచే అవకాశాలూ ఉన్నాయి. అనుకున్నట్లుగానే ఐదో రోజు మరో 20 పరుగులకే భారత్ 2 వికెట్లు కోల్పోయింది. భారత్ స్కోర్ 209/8 వద్ద ఉన్న సమయంలో బుమ్రా (34 నాటౌట్) మరియు మొహమ్మద్ షమీ (56 నాటౌట్) పట్టుదలగా ఆడారు. వీరిద్దరూ కలిసి తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 89 పరుగులు భాగస్వామ్యాన్ని జోడించారు. 298/8 వద్ద కెప్టెన్ కోహ్లీ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ ఆటను డిక్లేర్డ్ చేశాడు.
See this tweet:
WHAT. A. WIN! 👏 👏
Brilliant from #TeamIndia as they beat England by 1⃣5⃣1⃣ runs at Lord's in the second #ENGvIND Test & take 1-0 lead in the series. 👍 👍
Scorecard 👉 https://t.co/KGM2YELLde pic.twitter.com/rTKZs3MC9f
— BCCI (@BCCI) August 16, 2021
చివరి రోజు 272 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు డ్రా కోసమే ఆడాలనుట్టుగా ఆట మొదలుపెట్టింది. అయితే పరుగులేమి చేయకుండానే ఇంగ్లండ్ ఒపెనర్లు ఇద్దరూ డకౌట్లుగా వెనుదిరిగారు. ఈ అవకాశాన్ని భారత్ వదులుకోలేదు. మ్యాచ్ డ్రా కానివ్వకుండా బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి పెంచుతూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ విలవిలలాడిపోయింది. మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు, బూమ్రా 3 వికెట్లతో చెలరేగారు. టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 120 పరుగులకే కుప్పకూలింది.
డ్రా కావాల్సిన మ్యాచ్ ను టీమిండియా బౌలర్లు అద్భుతం చేసి మలుపుతిప్పడంతో లార్డ్స్ మైదానంలో భారత్ 151 పరుగుల రికార్డ్ విజయాన్ని నమోదు చేసింది.