Goswami (File Image)

NewDelhi, September 25: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలోనూ విజయం సాధించిన భారత అమ్మాయిలు 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేశారు. కెరియర్‌లో చివరి వన్డే ఆడుతున్న వెటరన్ పేసర్ జులన్ గోస్వామికి భారత జట్టు విజయంతో ఘనమైన వీడ్కోలు పలికింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 45.4 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసింది. అయితే, ఆ తర్వాత బౌలింగులో ప్రతాపం చూపించి లక్ష్యాన్ని కాపాడుకుంది.  170 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టుకు భారత బౌలర్లు తమ బంతుల రుచి చూపించారు. వరుస వికెట్లు తీస్తూ చెలరేగిపోయారు. 65 పరుగులకే ఏడు, 118 పరుగులకే 9 వికెట్లు పడగొట్టారు. అయితే, చివరి వికెట్ తీసేందుకు బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. క్రీజులో పాతుకుపోయిన చార్లొట్ డీన్ భారత జట్టును కాసేపు వణికించింది. దాదాపు విజయం దిశగా జట్టును నడిపించింది. బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టింది. దీంతో విజయం కాసేపు అటువైపు మొగ్గినట్టు కనిపించింది.  అయితే, చేతిలో ఉన్నది ఒకటే వికెట్ కావడంతో భారత జట్టులో ధీమా కనిపించింది. చివరికి 153 పరుగుల వద్ద డీన్ రనౌట్ కావడంతో 43.3 ఓవర్ల వద్ద ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. 80 బంతులు ఆడిన చార్లొట్ డీన్ 5 ఫోర్లతో 47 పరుగులు చేయగా, ఎమ్మా ల్యాంబ్ 21, కెప్టెన్ అమీ జోన్స్ 28 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రేణుక సింగ్ 4 వికెట్లు పడగొట్టగా, జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు, దీప్తి శర్మ ఒక వికెట్ తీసుకున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ సేన ఓపెనర్ స్మృతి మంధాన, దీప్తి శర్మ అర్ధ సెంచరీలతో రాణించడంతో 169 పరుగులు చేసింది. స్మృతి 79 బంతుల్లో 5 ఫోర్లతో అర్ధ సెంచరీ (50) చేయగా, దీప్తి 106 బంతుల్లో ఏడు ఫోర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. పూజా వస్త్రాకర్ 22 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో కేట్ క్రాస్ 4 వికెట్లు పడగొట్టగా, ఫ్రేయా కెంప్, ఎక్లెస్టోన్ చెరో 2, డేవీస్, చార్లొట్ డీన్ చెరో వికెట్ తీసుకున్నారు. నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన రేణుక సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను హర్మన్ సేన 3-0తో కైవసం చేసుకుంది. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌ను 1-2తో ఓడిపోయింది.