ఐపీఎల్-2022 సీజన్ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా (Simon Katich quits Sunrisers Hyderabad) చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. బెంగళూరు వేదికగా సాగిన ఐపీఎల్ మెగా వేలం-2022లో (IPL 2022) హైదరాబాద్ ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు (franchise 'ignored' pre-auction plans) నచ్చకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు విషయంలో యాజమాన్యంతో విభేదాలు తలెత్తడంతో జట్టును వీడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ది ఆస్ట్రేలియన్ పత్రిక కథనం వెలువరించింది.
కాగా గత సీజన్‌లో సన్‌రైజర్స్ దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. 14 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ కేవలం మూడింట మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను తొలగించడం సహా తుది జట్టులో కూడా చోటు కల్పించకపోవడంతో జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త సీజన్ ఆరంభానికి ముందు కొత్త సిబ్బందిని నియమించింది. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారాను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది.
ఆర్సీబీ మాజీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా ఎంచుకుంది. హెడ్‌కోచ్‌గా టామ్ మూడీ, ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా డేల్ స్టెయిన్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ముత్తయ్య మురళీధరన్, ఫీల్డింగ్ కోచ్, స్కౌట్‌గా హేమంగ్ బదాని వ్యవహరించనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. మెగా వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ తీరుపై కూడా అభిమానులు పెదవి విరుస్తున్న క్రమంలో కటిచ్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.