ఐపీఎల్-2023 సీజన్‌లో ముంబై పేలవ ఫామ్ కొనసాగిస్తోంది. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఏడు మ్యాచ్ లు ఆడగా మూడు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్-2023 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ పాక్షికంగా విరామం తీసుకోవాలని దిగ్గజ క్రికెటర్ సూచించాడు. గుజరాత్ చేతిలో ఓటమి అనంతరం హిట్‌మ్యాన్‌ను ఉద్దేశిస్తూ సన్నీ ఈ కామెంట్స్ చేశాడు.
సొంత మైదానంలో చెలరేగిన గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్‌పై 55 పరుగుల తేడాతో విజయం
స్వల్ప విరామం అనంతరం హిట్‌మ్యాన్ ఫ్రెష్‌గా ఆడుకోవచ్చని (ఐపీఎల్ చివరి మ్యాచ్‌ల్లో), ఇలా చేయడం వల్ల అతను డబ్ల్యూటీసీ ఫైనల్ మీద కూడా తన దృష్లిని కేంద్రీకరించవచ్చని తెలిపారు. ఫామ్‌లో లేని రోహిత్ బ్రేక్ తీసుకోవడం వల్ల గాయాల బారిన పడే ప్రమాదం కూడా తప్పుతుందని, 35 ఏళ్ల రోహిత్‌కు ఇది మేలు చేస్తుందని అన్నాడు. ముంబై ఇండియన్స్‌కు సైతం రోహిత్ గైర్హాజరీలో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుందని, ఇలా జరిగితే వారి ఆటతీరులోనూ మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.