Southampton, June 18: వర్షం కారణంగా తొలిరోజు తొలి సెషన్ ఆట రద్దైంది. శుక్రవారం ఉదయం నుంచి మ్యాచ్ జరిగే సౌథాంఫ్టన్ వేదికలో వర్షం కురుస్తుంది. మరో అర్ధగంట అయితే టాస్ పడుతుంది అనుకుంటున్న సమయంలో అంపైర్ల పిచ్ పరిశీలించారు. వర్షం ఇంకా కురుస్తూనే ఉండటంతో తొలి సెషన్ ఆటను రద్దు చేశారు. రెండో సెషన్ లో అయినా మ్యాచ్ ప్రారంభమవుతుందో లేదో చూడాలి.
మొట్టమొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. తొలి సెషన్ రద్దు కావడంతో మ్యాచ్ ఆలస్యం కానుంది.
సౌతాంప్టన్‌లోని ది రోజ్ బౌల్ వేదికగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) ఫైనల్‌లో భారత్ మరియు న్యూజిలాండ్ తలపడనున్నాయి. చాలా రోజుల తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుండటం అది కూడా టెస్ట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో టీమిండియా ఆడుతుండటంతో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
టీమిండియా తరఫున కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ గా అజింక్యా రహానే వ్యవహరించనున్నారు. జట్టులో ఆరుగురు బ్యాట్స్ మెన్, ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ మరియు ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగబోతుంది. తుదిజట్టులో విరాట్ కోహ్లీ (సి), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చేతేశ్వర్ పూజారా, అజింక్య రహానె, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా చోటు సంపాదించారు.
బ్యాటింగ్- బౌలింగ్ రెండింటి పరంగా టీమిండియా బలంగా కనిపిస్తోంది. అటు న్యూజిలాండ్ కూడా ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ 1-0 తేడాతో గెలిచి ఊపు మీద ఉంది. అంతేకాకుండా చాలాకాలం నుంచి ఇంగ్లండ్ లో వాతావరణ పరిస్థితులకు అలవాటుపడి ఉంది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇద్దరూ ఆధునిక బ్యాటింగ్ శైలిలో ఒకరికి ఒకరు సమవుజ్జీవులుగా ఉన్నారు. ఇద్దరూ 7,000పైగా టెస్ట్ పరుగులు పూర్తి చేయడమే కాకుండా ఇద్దరి బ్యాటింగ్ సగటు యాభైకి పైగానే ఉండటం విశేషం.
ఇక ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఫోటో షూట్ లో పాల్గొన్నారు. 'తుఫాను ప్రారంభానికి ముందు ప్రశాంత వాతావరణం' అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది.
The Calm Before The Storm:
The calm before the storm 📷
Take a behind the scenes look at Photo Shoot Day for the #WTC21 Final 👀#INDvNZ pic.twitter.com/7sLK1UX8FA
— ICC (@ICC) June 18, 2021
మరోవైపు మాత్రం, ఇంగ్లండ్ లో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ జరిగే సౌతాంప్టన్‌లో వాతావరణ పరిస్థితులు ఆశాజనకంగా కనిపించడం లేదు. బుధ, గురువారాల్లో వర్షంతో పాటు మరియు మేఘావృతమైన వాతావరణంతో వెంటనే చీకటి పడింది. శుక్రవారం ఫైనల్ మ్యాచ్ ప్రారంభమయ్యే డే 1 రోజున కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. అయితే మ్యాచ్ జరగని పక్షంలో ముందు జాగ్రత్తగా ఐసిసి ఒక రోజును రిజర్వ్ చేసింది. గరిష్ఠంగా 83 ఓవర్లు మరియు 330 నిమిషాలు కేటాయించారు, అలాగే ఇరు జట్ల కెప్టెన్లు కేన్ విలియమ్సన్ మరియు విరాట్ కోహ్లీ కూడా పరస్పరం నిర్ణయం తీసుకోవచ్చు.