New Zealand vs India 3rd T20I: 'సూపర్' మ్యాచ్‌లో 'హిట్' మ్యాన్ అదిరిపోయే షో, మూడో టీ20 లోనూ టీమిండియా అద్భుత విజయం, 3-0 తేడాతో సిరీస్ కైవసం
India vs New Zealand 2rd T20; Rohit Sharma- Super Over. | Photo: BCCI

ఏం ఆట, ఏం ముగింపు! సూపర్ ఓవర్ క్రికెట్ అభిమానులను థ్రిల్ చేసింది.  న్యూజిలాండ్ మరియు భారత్  (NZ vs Ind) మధ్య జరిగిన మూడో టీ20 'టై' (3rd T20 Tie) అవడంతో సూపర్ ఓవర్ (Super Over)కు దారితీసింది. ఉత్కంఠభరితంగా సాగిన చివరి ఓవర్లో రోహిత్ శర్మ (Rohit Sharma) వరుస సిక్సులతో మరో విజయం భారత్ ఖాతాలో చేరింది. ఫలితంగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా 3 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మిగిలిన 2 మ్యాచ్‌లు కేవలం నామమాత్రమే, న్యూజిలాండ్ వైట్‌వాష్ కాకుండా కేవలం పరువు దక్కించుకే ప్రయత్నమే మిగిలి ఉంది.

అసలు ఏం జరిగిందంటే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. భారత్ స్కోర్ 179/5.

ఛేజింగ్ మొదలు పెట్టిన న్యూజిలాండ్ జట్టు కూడా నిలకడగా ఆడుతూ వచ్చింది. 19 ఓవర్లలో న్యూజిలాండ్ స్కోర్ 171/4 గా ఉంది. క్రీజులో భయంకర బ్యాట్స్‌మెన్ కెప్టెన్ విలియమ్సన్ 95, రాస్ టేలర్ 10 వద్ద ఉన్నారు. న్యూజిలాండ్ విజయానికి ఇంకా 9 పరుగులు మాత్రమే అవసరం. ఇండియా మ్యాచ్ గెలిచే పరిస్థితే కనిపించడం లేదు.

ఈ స్థితిలో మహ్మద్ షమీ ((Mohd Shami) చివరి ఓవర్ వేయడానికి బాల్ అందుకున్నాడు. తొలి బంతికే రాస్ టేలర్ సిక్సర్ (6), ఇంకేం ఇండియా పని ఖతం అయిపోయిందనుకున్నారంతా.  న్యూజిలాండ్‌కు 5 బంతుల్లో కేవలం 3 పరుగులే అవసరం.

రెండో బంతి రాస్ టేలర్ సింగిల్, 4 బంతుల్లో రెండే పరుగులు అవసరం.

మూడో బంతి విలియమ్సన్ భారీషాట్, గాల్లో బంతి, ట్విస్ట్ రాహుల్ చేతిలో బంతి. 48 బంతుల్లో 95 పరుగులు చేసిన విలియమ్సన్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఇక్కడతో ముగిసింది. 3 బంతుల్లో 2 పరుగులు అవసరం.

నాలుగో బంతి కొత్త బ్యాట్స్‌మెన్ సీఫర్ట్, పరుగులేమి రాలేదు. 2 బంతుల్లో 2 పరుగులు అవసరం.

ఐదో బంతి సీఫర్ట్ కొట్టడానికి ప్రయత్నించిన బ్యాట్‌కు తగలేదు. అయినా బైస్ రూపంలో ఒక పరుగు వచ్చింది. 1 బంతిలో 1 పరుగు.

చివరి బంతి, నరాలు తెగే ఉత్కంఠ, క్రీజులో భయంకరమైన రాస్ టేలర్, ఎలాంటి బంతి వేయాలి అనుకుంటున్న సమయంలో షమీ ప్లాన్ 'ఏ' అమలు. ఫుల్ టాస్ విసిరాడు, ఇంకే భారీ హిట్‌కు యత్నించిన రాస్ టైలర్ బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్ అయింది. బంతి నేరుగా వికెట్లను పడగొట్టింది. స్టేడియంలో, టీవీల ముందు ప్రేక్షకుల హర్షధ్వనాలు. స్కోర్స్ లెవెల్, సూపర్ ఓవర్‌కు అంపైర్స్ పిలుపు.

సూపర్ ఓవర్ ఫస్ట్ బ్యాటింగ్ న్యూజిలాండ్, కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్టిల్ బ్యాటింగ్‌కు వచ్చారు. బూమ్రా చేతికి బాల్.

ఏదో పరుగులను కట్టడి చేస్తాడని కెప్టెన్ విరాట్ కోహ్లీ బుమ్రాకు బౌలింగ్ ఇస్తే కెప్టెన్ నమ్మకాన్ని బూమ్రా వమ్ము చేశాడు.  న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ విలియమ్సన్, గప్టిల్‌లు బూమ్రా బౌలింగ్‌ను చితకొట్టారు. ధోనీ ఉండుంటే ఏదైనా మాయాజాలం చేసుండేవాడేమోనని ప్రేక్షకుల్లో ఆలోచన మెదిలింది.  సూపర్ ఓవర్లో 1 సిక్స్, 2 ఫోర్లు, మూడు సింగిల్స్‌తో న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది.

భారత్ లక్ష్యం 6 బంతుల్లో 18 పరుగులు, వికెట్ కూడా నష్టపోకూడదు.

సీమర్ టిమ్ సౌథీ చేతిలో బంతి ,  రోహిత్ శర్మ, కేల్ రాహుల్‌లు క్రీజులోకి వచ్చారు.

తొలి బంతికి రోహిత్ శర్మ హార్డ్ హిట్టింగ్ ,  ఫీల్డర్ చేతిలోకి బాల్, ఒక పరుగు వచ్చింది. ఈ స్థితిలో రోహిత్ రెండో పరుగుకోసం యత్నించి కొద్దిలో రనౌట్ మిస్ అయ్యాడు. ఫీల్డర్ విసిరిన బంతిని కీపర్ అందుకోకపోవడంతో తొలి బంతికే ఔట్ అయ్యే గండం నుంచి రోహిత్ బయటపడ్డాడు. 5 బంతుల్లో ఇంకా 16 పరుగులు చేయాలి.

రెండో బంతికీ రోహిత్ హార్డ్ హిట్ చేసినా, ఫీల్డర్ చేతికే బంతి 1 పరుగు మాత్రమే. భారత్ 3/0.   4 బంతుల్లో ఇంకా 15 పరుగులు చేయాలి.

మూడో బంతికి కేఎల్ రాహుల్ 4, భారత్ 7/0 , 3 బంతుల్లో ఇంకా 11 పరుగులు చేయాలి.

నాలుగో బంతికి కేఎల్ రాహుల్ హార్డ్ హిట్టింగ్, కానీ 1 పరుగు. భారత్ 8/0, 2 బంతుల్లో ఇంకా 10 పరుగులు చేయాలి.

10 పరుగులు అంటే భారత్ మిగిలిన రెండు బంతుల్లో ఖచ్చితంగా 1 సిక్స్, 1 ఫోర్ కొడితేనే మ్యాచ్ నిలుస్తుంది.

ఐదో బంతికి రోహిత్ శర్మ భారీ సిక్స్, గాల్లో చాలా ఎత్తుకు వెళ్లిన బంతి? ఏం జరుగుతుంది క్యాచా? సిక్సా? బౌండరీకి సమీపంలో సిక్స్ (6). భారత్ 14/0, 1 బంతిలో 4 పరుగులు అవసరం.

ఇక చివరి బంతి, ఏమవుతుంది? రోహిత్ శర్మ భారీ షాట్, సందేహమే లేదు.. ఇది నేరుగా సిక్సర్. బ్యాక్ టు బ్యాక్ రెండు సిక్సులు కొట్టిన రోహిత్ శర్మ,  మ్యాచ్ భారత్ వశం, అలాగే సిరీస్ కూడా కైవసం. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డ్ కూడా రోహిత్ శర్మకే దక్కింది.

ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులో ఇన్నింగ్స్ అత్యధిక స్కోర్ సాధించిన బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ 65, కెప్టెన్ విరాట్ కోహ్లీ 38. ఈ మ్యాచ్‌లో రోహిత్, మహ్మద్ షమీ వీరోచిత ప్రదర్శన పట్ల అభిమానులు వారిపై  ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక కివీస్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్ 95, మార్టిన్ గప్టిల్ 31. నాలుగో టీ20 జనవరి 31న, ఐదో టీ20 ఫిబ్రవరి 02న షెడ్యూల్ చేయబడి ఉన్నాయి.