Meg Lanning Retirement (PIC@ X)

Malborne, NOV 09: ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ మేగ్ లానింగ్(Meg Lanning) సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. నిరుడు ఆసీస్‌కు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్(T20 World Cup 2022) అందించిన లానింగ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికింది. ఆట నుంచి త‌ప్పుకునేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని ఈ స్టార్ కెప్టెన్‌ (Captain) వెల్ల‌డించింది. ఈ ఏడాది ప‌లు సిరీస్‌ల‌కు దూర‌మైన ఆమె క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి అంద‌ర్నీ షాక్‌కు గురిచేసింది. ‘క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌కాల‌నుకోవ‌డం క‌ష్ట‌మైన నిర్ణ‌య‌మే. కానీ, ఇదే స‌రైన స‌మ‌యం అనిపించింది 13 ఏండ్లు అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడం అదృష్టంగా భావిస్తున్నా. ఇన్నేండ్ల ప్ర‌యాణంలో జ‌ట్టు స‌భ్యుల‌తో అపూర్వ క్ష‌ణాల‌ను అస్వాదించాను. నాకు ఇష్ట‌మైన ఆట‌లో ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించేందుకు ఎంత‌గానో స‌హ‌క‌రించిన‌ కుటుంబ స‌భ్యులు, జ‌ట్టు స‌భ్యులు, క్రికెట్ విక్టోరియా, క్రికెట్ ఆస్ట్రేలియా, ఆసీస్ క్రికెట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు’ అని లానింగ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

 

కామ‌న్‌వెల్త్ గేమ్స్ త‌ర్వాత లానింగ్ ప‌లు సిరీస్‌ల‌కు దూర‌మైంది. ఆ త‌ర్వాత ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్‌ల‌తో పాటు స్వ‌దేశంలో వెస్టిండీస్ జ‌రిగిన సిరీస్‌లో ఆడ‌లేదు. లానింగ్ 18 ఏండ్ల వ‌య‌సులోనే క్రికెట్‌లో ఆరంగేట్రం చేసింది. మొద‌ల్లో టీ20ల్లో ఆడిన ఆమె ఆ త‌ర్వాత వ‌న్డే, టెస్టు జట్టులోకి వ‌చ్చింది. లానింగ్ సార‌థ్యంలో ఆసీస్ ఏకంగా 4 సార్లు పొట్టి ప్రపంచ‌క‌ప్ విజేత‌గా నిలిచింది. 13 ఏండ్ల కెరీర్‌లో ఆసీస్ త‌ర‌ఫున 132 టీ20లు, 103 వ‌న్డేలు ఆడింది. ఆరు టెస్టు మ్యాచ్‌ల‌కు సార‌థ్యం వ‌హించింది. ఆమె కెప్టెన్సీలో కంగారు జ‌ట్టు 69 వ‌న్డేల్లో, 100 టీ20ల్లో, 4 టెస్టుల్లో గెలుపొందింది. ప్ర‌స్తుతం మ‌హిళ‌ల బిగ్‌బాష్ లీగ్‌(WBBL)లో లానింగ్ మెల్‌బోర్న్ స్టార్స్‌(Melbourne Stars)కు సార‌థ్యం వ‌హిస్తోంది.

 

లానింగ్ మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ తొలి సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals) జ‌ట్టుకు సార‌థిగా వ్య‌వ‌హ‌రించింది. ఆమెను రూ.1.1 కోట్ల‌కు ఢిల్లీ కొన్న‌ది. ఫ్రాంఛైజీ న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ.. అద్భుతంగా రాణించి జ‌ట్టును ఫైన‌ల్‌కు తీసుకెళ్లింది. అయితే.. టైటిల్ పోరులో హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియ‌న్స్ జోరు ముందు ఢిల్లీ చేతులెత్తేసింది. రెండో సీజ‌న్‌లోనూ లానింగ్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వ‌హించనుంది.