Azharuddin New Innings: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మహమ్మద్ అజరుద్దీన్ ఎన్నిక, ఎన్నికల్లో సెంచరీ కొట్టి ఘనవిజయం, కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మాజీ కెప్టెన్
File Image of Mohammad Azharuddin | Photo Credits: IANS

Hyderabad, September 27:  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association)  అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ లీడర్ మహ్మద్ అజరుద్దీన్ (Mohammad Azharuddin) ఎన్నికయ్యారు . హైదరాబాద్‌‌లోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో అజర్, తన సమీప ప్రత్యర్థి ప్రకాశ్ జైన్‌పై 147-73 తేడాతో ఘన విజయం సాధించారు. HCA ఎన్నికల్లో మొత్తం 227 ఓట్లకు గానూ, 223 సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ చివరి నిమిషంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ ఎన్నికల్లో అజరుద్దీన్‌కు 147 ఓట్లు, ప్రకాశ్ జైన్ కు 73 ఓట్లు, మరో అభ్యర్థి దిలీప్ కుమార్‌కు కేవలం 3 ఓట్లు పోలయ్యాయి. అజరుద్దీన్ ప్యానెల్‌కే చెందిన జాన్ మనోజ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు 49 ఓట్ల ఆధిక్యం లభించింది.

56 ఏళ్ల అజరుద్దీన్, టీమిండియా సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకరు. ఈ మాజీ కెప్టెన్ భారత్ తరఫున 99 టెస్టులు మరియు 334 వన్డేలు ఆడాడు.  క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి రాజకీయాల్లో చేరిన ఆయన,  ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా కూడా గెలిచారు.  ప్రస్తుతం హెచ్‌సీఎ ప్రెసిడెంట్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు.

HCA అధ్యక్ష పీఠం కోసం అజర్ గతేడాదే గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పట్లో ఆయన నామిషేనన్ రద్దయింది. దీంతో ఈసారి చాలా పకడ్బందీగా వ్యవహరించి అనుకున్నది సాధించారు. HCA ప్రెసిడెంట్ పదవి కోసం పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కూడా ప్రయత్నాలు చేశారు. అయితే ఈ సారి ఆయన నామినేషన్ రద్దు కావడంతో వివేక్,  ప్రకాశ్ జైన్‌కు మద్ధతు పలికారు.