Tokyo, May 09: టీ20 క్రికెట్‌లో మంగోలియా టీమ్ ఎవరూ కోరుకోని రికార్డును సొంతం చేసుకుంది. 12 పరుగులకే ఆలౌటైంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 8.5 ఓవర్లలోనే కుప్పకూలింది. దీంతో జపాన్ 205 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. కాగా.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యల్ప స్కోరు 10 కావడం గమనార్హం. గత ఏడాది ఫిబ్రవరి 26న స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు 10 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డును నమోదు చేసింది.
Second lowest total in T20I history. Japan bowl out Mongolia for just 12 runs. pic.twitter.com/BQxyYVk4ZJ
— Himanshu Pareek (@Sports_Himanshu) May 8, 2024
సాన్‌లోని క్రికెట్ గ్రౌండ్‌లో మంగోలియా, జపాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత జపాన్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. జపాన్ బ్యాటర్లలో సబౌరిష్ రవిచంద్రన్ (69; 39 బంతుల్లో 6 ఫోర్లు, 4సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ (32), ఇబ్రహీం తకాహషి (31) లు రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన మంగోలియాకు జపాన్ బౌలర్ కజుమా కటో స్టాఫోర్డ్ చుక్కలు చూపించాడు. 3.2 ఓవర్లు వేసి 7 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో 8.5 ఓవర్లలో 12 పరుగులకు ఆలౌటైంది. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఆరుగురు డకౌట్లు కావడం గమనార్హం. సుమియా చేసిన 4 పరుగులే టాప్ స్కోర్.
టీ20 క్రికెట్‌లో అత్యల్ప స్కోర్లు ఇవే!
10 – ఐల్ ఆఫ్ మ్యాన్ vs స్పెయిన్ (2005)
12 – మంగోలియా vs జపాన్ (2024)
21 – టర్కీ vs చెక్ రిపబ్లిక్ (2019)
23 – చైనా vs కౌలాలంపూర్ (2023)
24 – రువాండా vs నైజీరియా (2023)