Ranchi, May 22: ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కథ ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోవడంతో ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటి దారి పట్టింది. 14 మ్యాచుల్లో ఏడు గెలవగా, మరో ఏడింటింలో ఓడిపోయి ఐదో స్థానంతో ఈ సీజన్ నుంచి నిష్ర్కమించింది. ధోనికి (Dhoni) ఇదే చివరి సీజన్ అని ప్రచారం జరుగగా వీటిపై అతడు మాత్రం స్పందించలేదు. ఐపీఎల్‌లో చెన్నై కథ ముగియడంతో స్వస్థలం రాంచీ వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. సోషల్ మీడియాలో ధోని పెద్దగా యాక్టివ్‌గా ఉండడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. తాజాగా ధోని తన ఫేస్‌బుక్‌లో (Dhoni Facebook) చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇది అతడి రిటైర్‌మెంట్‌పై ఊహాగానాలను మరింత పెంచేదిగా ఉంది. విశ్రాంతి తీసుకోవడానికి సరైన సమయం. ముఖ్యమైన పనులు చేయడానికి అనువైన సమయం. నేను నా సొంత జట్టును ప్రారంభిస్తున్నాను అని ధోని పోస్ట్ చేశాడు.
అసలు ధోని దేని గురించి ఇలా పోస్ట్ చేశాడో అర్థం కావడం లేదు. కొందరు ఇది అతడికి రిటైర్‌మెంట్‌కు సంబంధించి హింట్ ఇచ్చాడని అంటుంటే, మరికొందరు మాత్రం ఏదైన యాడ్‌కు సంబంధించిన ప్రకటన కావొచ్చునని అంటున్నారు. జట్టును ప్రారంభించబోతున్నానని చెప్పడంతో.. ఇది క్రికెట్‌కు సంబంధించిన జట్టా? లేక ఐపీఎల్‌లో జట్టును తీసుకోబోతున్నాడా? మరేదైన స్పోర్ట్స్‌లో అతడు భాగస్వామ్యం అవుతున్నాడా? అనే టాక్ నడుస్తోంది.
ప్రస్తుతానికి ధోని చేసిన పోస్ట్‌కు అర్థం తెలియకపోవచ్చు గానీ.. రానున్న రోజుల్లో తెలిసిపోతుందని నెటిజన్లు అంటున్నారు.