అక్టోబర్ 17 నుండి యుఎఇ మరియు ఒమన్‌లో జరిగే టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. అయితే, జట్టు కూర్పులో భాగంగా బిసిసిఐ కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంది. 2017 నుండి ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా స్పిన్నర్ ఆడని రవిచంద్రన్ అశ్విన్ ను జట్టులోకి ఎంపిక చేశారు. పేసర్ మహమ్మద్ షమీ కూడా జట్టులో చోటు సంపాదించగా, ఇషాన్ కిషన్ రెండవ వికెట్ కీపర్‌గా జట్టులో చేర్చబడ్డాడు.
ఇక మరో పెద్ద ప్రకటన ఏమిటంటే, గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన భారత క్రికెట్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని బిసిసిఐ ఎంపిక చేసింది. ఎంఎస్.ధోనీని ప్రత్యేకంగా ఈ మెగా టోరమెంట్ కోసం భారత జట్టుకు మెంటర్‌గా వ్యవహరించనున్నాడు.
భారత జట్టును ప్రకటించిన అనంతరం, విలేకరుల సమావేశంలో మాట్లాడిన బీసీసీఐ కార్యదర్శి జయ్ షా, టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియాకు ధోని ఒక మెంటర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు.
ఆయన మాట్లాడుతూ "నేను దుబాయ్‌లో ఉన్నప్పుడు ధోనితో మాట్లాడాను. అతడు ప్రపంచ కప్ కోసం మాత్రమే భారతదేశానికి మార్గదర్శకత్వం వహించడానికి అంగీకరించాడు. మేం అంతకు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరియు కోచ్ రవిశాస్త్రితో చర్చించాము. అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం" అని జయ్ షా వెల్లడించారు.
ఐసీసీ టోర్నమెంట్స్ జరుగుతున్నప్పుడు మ్యాచ్ కు తగినట్లుగా తుది జట్టు కూర్పును చేయడం, సరైన వ్యూహాలు రూపొందించడం, ఒత్తిడిని జయించడం, ఏ సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై మెంటర్‌గా ఎం.ఎస్ ధోని అనుభవం టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడుతుందని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
టీ20 వరల్డ్ కప్ భారత జట్టు.. విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
స్టాండ్‌బై ప్లేయర్స్ : శ్రేయాస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్.