Mumbai, DEC 16: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఆ జట్టుకు ఐదు సార్లు కప్పును అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను (Rohit Sharma) సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది. ఐపీఎల్ 2024 సీజన్‌కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య నాయకత్వంలో జట్టు బరిలోకి దిగుతుందని ప్రకటించింది. ముంబై తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించడాన్ని అతడి అభిమానులతో పాటు ముంబై ఇండియన్స్ కు చెందిన ఫ్యాన్స్ సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. #ShameOnMI అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పిస్తున్నట్లు ప్రకటించడాని కంటే ముందు ఆ జట్టుకు చెందిన సోషల్ మీడియా అయిన ఎక్స్(ట్విట్టర్)కు 8.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉ్ననారు. నిర్ణయం వెలువడిన తరువాత దాదాపు 4 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ముంబైని అన్‌ఫాలో అయ్యారు.
అటు ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం 1.5లక్షల మంది ఫాలోవర్లను ముంబై కోల్పోయింది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఐపీఎల్ టీమ్‌ల జాబితాలో రెండో స్థానానికి పడిపోయింది. ఒకవేళ రోహిత్ శర్మ రానున్న ఐపీఎల్‌లో ఆడపోతే మాత్రం పెద్ద సంఖ్యలో అభిమానులు ముంబైని వీడే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే గనుక ముంబై జట్టు బ్రాండ్ వాల్యూ పడిపోయే అవకాశం ఉంది.