Hardik Pandya: జ‌ట్టు గెలుపుకోసం గుడిబాట ప‌ట్టిన కెప్టెన్, సోమ‌నాథ్ ఆల‌యంలో హార్ధిక్ పాండ్యా ప్ర‌త్యేక పూజ‌లు (వీడియో ఇదుగోండి)
Hardik Pandya (Photo: ANI/ Somnath Temple Trust)

Somnath, April 06: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌-2024 (IPL-2024)లో ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) జట్టు వరుస పరాజయాల పాలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. గత సీజన్లలో మంచి ఆటతీరుతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్‌ ఈ సారి ఘోరంగా విఫలమవుతుండటంతో అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. ఇక ముంబై జట్టు తదుపరి మ్యాచ్‌ ఏప్రిల్‌ 7న వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు జట్టుకు లాంగ్‌ బ్రేక్‌ దొరికింది. దీంతో జట్టు సభ్యులంతా కాస్త చిల్‌ అవుతున్నారు. ఒత్తిడికి గురవ్వకుండా తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ముంబై జట్టు మొత్తం గుజరాత్‌ టూర్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) అక్కడ ప్రసిద్ధ సోమనాథ్‌ ఆలయాన్ని (Somnath Temple) సందర్శించాడు. సంప్రదాయ దుస్తుల్లో అతడు మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

 

కాగా, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్ దేవాలయానికి దేశం నలుమూలల నుంచి రోజూ వేల సంఖ్యలో భక్తులు మహాదేవుడి సందర్శనార్థం వస్తుంటారు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్‌లో తడబాటుకు లోనవుతున్న విషయం తెలిసిందే. గుజరాత్ టీం కెప్టెన్‌గా అద్భుత విజయాలు అందుకున్న పాండ్యా ముంబై ఇండియన్స్ విషయంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకూ ఆడిన అన్ని మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమైంది. జట్టు విజయం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.