
Navsari, August 9: 2018 లో బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన బృందంలో భాగమైన నరేష్ తుమ్దా (Naresh Tumda) నేడు కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ప్రభుత్వం నుంచి సహాయం అందక జీవనోపాధి కోసం రోజు కూలిగా మారి పొట్ట పోషించుకుంటుకున్నాడు. అంతేకాదు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదైనా ఉద్యోగమివ్వాలని వేడుకుంటున్నాడు.ఈ కథనాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANI ప్రచురించింది.
ANI కథనం ప్రకారం... 2018లో బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్‌ను సాధించిన విన్నింగ్ టీమ్‌లో (2018 Blind Cricket World Cup winning team member) సభ్యుడు నరేష్ తుమ్డా. 2018 జనవరి 20న షార్జాలో జరిగిన ఫైనల్లో (Blind Cricket World Cup in 2018) భారత్ పాకిస్తాన్‌ని ఓడించింది. పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 40 ఓవర్లలో 307 పరుగులు చేసింది. 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగన భారత్ భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి రెండు వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. చివరి ఓవర్ మిగిలి ఉండగానే భారత్ తన ఛాంపియన్స్ పరంపరను కొనసాగించింది. కాగా వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ 1996 నుండి బ్లైండ్ క్రికెట్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికి అయిదుసార్లు ఈ పోటీలు జరిగాయి. అలాగే 2012లో తొలిసారిగా బ్లైండ్ వరల్డ్ కప్ టీ20 బెంగళూరులో జరిగింది.

అయితే కప్ విజయంలో తనదైన పాత్రను పోషించిన అంధుడైన నరేష్ ఇపుడు గుజరాత్ రాష్ట్రంలో నవ్‌సారీలో (Gujarat's Navsari) కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజుకు కేవలం 250 రూపాయలు సంపాదనతో అరకొర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిని కలిసినా ఎలాంటి ప్రయోజనం రాలేదని నరేష్ వాపోయాడు. ఇప్పటికైనా తన కుటుంబ పోషణకోసం ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
ప్రపంచ కప్ గెలిచిన తర్వాత మేము ఢిల్లీకి తిరిగి వచ్చినప్పుడు అందరూ అభినందించారని, కేంద్ర మంత్రులు మరియు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని మేము కలిశామని వారు కూడా అభినందనలు తెలిపారని నరేష్ తుమ్డా తెలిపారు. మేము ప్రపంచ కప్ గెలిచినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను మరియు నాకు ఉద్యోగం వస్తుందని అనుకున్నాను కానీ ఇప్పటి వరకు నాకు ఉద్యోగం రాలేదు. నా జీవనోపాధికి ఉద్యోగం అందించమని నేను ప్రధానమంత్రిని కోరుతున్నాను" అని ఆయన అన్నారు. కాగా ప్రాథమిక అవసరాలతో ఇబ్బంది పడుతున్న యువ ప్రతిభావంతులైన క్రికెటర్ తుమ్దా తనకు జీవనోపాధి కోసం ఉద్యోగం కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు.