Uppal Stadium (PIC @ X)

Hyderabad, JAN 28: నాలుగు గంటలలో ముగిసిపోయే టీ20ల (T-20) మోజులో ఇతర ఫార్మాట్ల మనుగడే ప్రశ్నార్థకమువుతున్న వేళ భాగ్యనగరం టెస్టు క్రికెట్‌కు సరికొత్త ఊపిరులూదింది. క్రికెట్‌లో అసలైన మజాను ఇచ్చే టెస్టులను (Test) చూసేందుకు తాము ఎందుకు రామని, ఆటను ప్రోత్సహించకుండా ఎలా ఉంటామని హైదరాబాద్‌ వాసులు ఘనంగా చాటిచెప్పారు. ఐదేండ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌ జరుగుతున్నా (India Vs England First Test) భారత స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ (Virat kohli) ఆడకున్నా ఉప్పల్‌లో (Uppal Test) నాలుగు రోజులుగా అభిమానులు పోటెత్తారు. నాలుగు రోజులలో మొత్తంగా లక్షకు మందికి పైగా ఈ మ్యాచ్‌ను స్టేడియం నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ మధ్యకాలంలో భారత్‌ స్వదేశంలో ఆడిన టెస్టులకు ఇంతమంది హాజరవడం బహుశా ఇదే ప్రథమం. 2018 తర్వాత టెస్టులకు ఉప్పల్‌ స్టేడియం తొలిసారి ఆతిథ్యమిచ్చింది.

 

వన్డే వరల్డ్‌ కప్‌లో పునర్నిర్మాణ పనులు చేపట్టాక పూర్తిగా కొత్త లుక్‌లో ఉన్న ఉప్పల్‌లో కొత్తగా ఎన్నికైన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) ప్రేక్షకులకు అన్ని వసతులను సమకూర్చి వాళ్లు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తపడింది.

 

బీసీసీఐ లెక్కల ప్రకారం.. భారత్‌ – ఇంగ్లండ్‌ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ను చూడటానికి తొలి రోజు (జనవరి 25న) 23వేల మందికి పైగా జనం వచ్చారు. రెండో రోజు 32 వేలకు పైగా మంది స్టేడియానికి హాజరుకాగా మూడో రోజు 25,561 మంది మ్యాచ్‌ను తిలకించారు. ఆట కీలక మలుపులు తిరిగిన నాలుగో రోజు కూడా సుమారు 28 వేల మంది హాజరయ్యారు.

 

భారత్‌లో క్రికెట్‌కు క్రేజ్‌ ఉన్నా టీ20ల యుగంలో అభిమానులు టెస్టు మ్యాచ్‌ చూసేందుకు అంతగా ఆసక్తిచూపడం లేదన్నది కాదనలేని వాస్తవం. అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌ -ఆస్ట్రేలియా మధ్య గతేడాది బోర్డర్‌ – గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో స్టేడియం మొత్తం ఖాళీగా కనిపించింది. భారత, ఆస్ట్రేలియా ప్రధానులు తొలి రోజు మ్యాచ్‌కు హాజరైనా ఆ మ్యాచ్‌లో జనమే కనిపించలేదు. కానీ హైదరాబాద్‌లో మాత్రం అందుకు భిన్నంగా టెస్టు జరిగిన నాలుగు రోజులూ స్టేడియం కళకళలాడింది. ఈ నాలుగు రోజులుగా ఉప్పల్‌, ఎల్‌బీ నగర్‌ ఏరియాలలో ఉదయంతో పాటు సాయంత్రం పూట ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోయిందనేది నగరవాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.