2023 Cricket World Cup: ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి (ICC One Day World Cup) భారత్ (Bharath) ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 5న టోర్నీ ఆరంభమవుతుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది. ఫైనల్ సహా మొత్తం 46 మ్యాచ్‌లను 12 వేదికల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రపంచకప్ లో ఆడుతుందా లేదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా... భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను చెన్నై, కోల్‌తాల్లో ఆడేందుకు పాకిస్థాన్ మొగ్గుచూపుతోందని ఐసీసీ వర్గాలు తెలిపాయి.
బీసీసీఐ, భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న దానిపై చాలా ఆధారపడి ఉంది. ఒకవేళ పాకిస్థాన్‌నే ఎంచుకోమంటే.. తమ మ్యాచ్‌ల్లో చాలా వరకు కోల్‌కతా, చెన్నైలో ఆడేందుకే మొగ్గుచూపుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పాక్ 2016 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో తన మ్యాచ్‌ను కోల్‌కతాలో ఆడింది. ఇక చెన్నై ఆ జట్టుకు చిరస్మరణీయ వేదిక. పాక్‌కు ఈ వేదికలు సురక్షితంగా అనిపిస్తాయి కూడా’’ అని ఓ ఐసీసీ అధికారి చెప్పాడు. అదేవిధంగా చెన్నైలో కూడా పాకిస్థాన్‌కు కొన్ని మంచి అనుభవాలు ఉన్నాయి. దీంతో ఆ వేదిక కూడా తమకు అనువైనదిగా భావిస్తున్నది.
ఈ వరల్డ్‌కప్‌లో అంతా ఆసక్తి కనబర్చేది దాయాదుల మధ్యపోరుపైనే. దీంతో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో (Ahmedabad) నిర్వహిస్తే భారీగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ స్టేడియం సామర్థ్యం లక్షా 32 వేలు. అయితే అహ్మదాబాద్‌లో ఫైనల్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను విడుదల చేసినప్పుడే ఈ విషయంపై ఒక స్పష్టత రానుంది. ఐసీసీ ఈవెంట్స్ కమిటీ, ఆతిథ్య దేశానికి చెందిన క్రికెట్ బోర్డు మ్యాచ్‌ల షెడ్యూల్‌ను త్వరలో నిర్ణయించనున్నాయి.
ఈ ఏడాది పాక్‌లో జరుగనున్న ఆసియా కప్‌ను తాము తటస్థ వేదికల్లో అయితేనే ఆడతామని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో తమదేశంలో భారత్ ఆసియా కప్ ఆడకుంటే.. తాము కూడా ఇండియాలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ ఆడేది లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. బంగ్లాదేశ్, శ్రీలంకల్లోని తటస్థ వేదికల్లో తమ జట్టు మ్యాచ్‌లను నిర్వహించాలని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు చెన్నై, కోల్‌కతాలో అయితే తాము ఆడుతామంటూ కొత్త రాగం అందుకున్నది.
ఇదిలా ఉంటే ఐదు ప్రధాన స్టేడియాలకు మరమ్మతులు చేసి, వాటికి కొత్త కళ తెచ్చేందుకు బీసీసీఐ ఏర్పాట్లు మొదలుపెట్టింది. అందుకోసం భారీ మొత్తంలో రూ. 502.92 కోట్లు ఖర్చు చేయనుంది. ఇంతకు ఆ ఐదు స్టేడియాలు ఏవంటే..? ఢిల్లీ స్టేడియం, వాంఖడే(ముంబై), మొహాలీ (పంజాబ్), రాజీవ్ గాంధీ(హైదరాబాద్), ఈడెన్స్ గార్డెన్( కోల్‌కతా).ఈడెన్స్ గార్డెన్(Eden Gardens) మైదానాన్ని రూ. 117.17 కోట్లతో రిపేర్ చేయనున్నారు. ఢిల్లీ స్టేడియం మరమ్మతుల కోసం రూ. 100 కోట్లు, హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియాన్ని ముస్తాబు చేయడం కోసం రూ.117.7 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. పంజాబ్‌లోని మొహాలీ స్టేడియం మరమ్మతు కోసం రూ.79.46 కోట్లు, ముంబైలోని వాంఖడే మైదానాన్ని సుందరీకరించేందుకు రూ.78.82 కోట్లు కేటాయించారు.
ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ మధ్యలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ మెగా టోర్నీకి ఇప్పటికే టీమిండియా, ఆస్ట్రేలియాతో సహా తొమ్మిది జట్టు క్వాలిఫై అయ్యాయి. 2011లో స్వదేశంలో విశ్వ విజేతగా నిలిచిన భారత్ ఈసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. వరల్డ్ కప్ సన్నద్ధత కోసం బీసీసీఐ 20 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో టాప్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ ఉన్నారు. మరి సొంతగడ్డపై రోహిత్ సేన ట్రోఫీ నెగ్గుతుందా? మూడోసారి వరల్డ్ కప్ చాంపియన్‌గా నిలుస్తుందా? అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.