Ramiz Raja: ప్రధాని మోదీ తలుచుకుంటే పాక్ క్రికెట్ బోర్డు ఉండదు, బీసీసీఐ, ఐసీసీ నుంచి నిధులు ఆపేస్తే పీసీబీ కుప్పకూలుతుంది, సంచలన వ్యాఖ్యలు చేసిన రమీజ్ రాజా
Ramiz Raja (Photo Credits: Twitter@TheRealPCBMedi)

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ మాజీ క్రికెటర్ పీసీబీ నిధుల (Pakistan Cricket Board Funds) గురించి మాట్లాడుతూ.. ఇండియా, ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీసీఐ తమ దేశ క్రికెట్ బోర్డుపై గట్టి పట్టు సాధిస్తున్నాయని అన్నాడు.

ఐసీసీ నుంచి పీసీబీకి నిధులు అందకూడదని కనుక భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) నిర్ణయించుకుంటే పీసీబీ కుప్పకూలడం ఖాయమని తెలిపాడు. పాకిస్థాన్ సెనేట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రమీజ్ రాజా మాట్లాడుతూ.. ఐసీసీ నుంచి పీసీబీకి 50 శాతం నిధులు వస్తున్నాయని, బీసీసీఐ నుంచి ఐసీసీకి 90 శాతం నిధులు (Indian money keeps PCB afloat) అందుతున్నాయని అన్నాడు.

ఈ లెక్కన చూసుకుంటే భారత వ్యాపార సంస్థలే పాక్ క్రికెట్‌ను నిర్వహిస్తున్నట్టు అర్థమని పేర్కొన్నాడు. ఒకవేళ భారత ప్రధాని నరేంద్రమోదీ కనుక పాకిస్థాన్‌కు నిధులు ఇవ్వొద్దని నిర్ణయించుకుంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కుప్పకూలడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశాడు.

పాక్ క్రికెటర్లతో పోటీ పడేంత సీన్ భారత క్రికెటర్లకు ఉందా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్

ఇక రమీజ్ రాజా ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ క్రికెట్ ఐసీసీ నిధులపైనే ఆధారపడి కాలం వెళ్లదీస్తోందని, ఒకవేళ ఏదైనా కారణంతో అది కనుక నిధులు ఆపేస్తే కష్టాలు తప్పవని పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో పాకిస్థాన్ సూపర్ పవర్‌గా ఎదగాలంటే సహకారం తప్పనిసరి అని స్పష్టం చేశాడు. పాక్ క్రికెట్‌కు స్థానిక వ్యాపారవేత్తల నుంచి అందుతున్న సహకారం చాలా తక్కువని రమీజ్ రాజా ఆవేదన వ్యక్తం చేశాడు.

పాకిస్థాన్ క్రికెట్‌ను బ‌లోపేతం చేయాల‌నుకున్నాన‌ని, అయితే ఓ పెద్ద ఇన్వెస్ట‌ర్ భారీ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని, ఒక‌వేళ ఇండియాను వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లో ఓడిస్తే, పాక్ జ‌ట్టుకు బ్లాంక్ చెక్ ఇచ్చేందుకు ఆ ఇన్వెస్ట‌ర్ ముందుకు వ‌చ్చిన‌ట్లు పీసీబీ చైర్మ‌న్ ర‌మీజ్‌ రాజా తెలిపారు. ఉత్త‌మ‌మైన క్రికెట్ జ‌ట్టు ఉండాలంటే, బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా కీల‌క‌మ‌ని రాజా అన్నారు.