Jonny Bairstow (PIC@ IPL X)

Kolkata, April 26: ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో రోజురోజుకు రికార్డులు బ‌ద్ద‌లైపోతున్నాయి. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (Sunrisers Hyderabad) జ‌ట్టు అత్య‌ధిక ప‌రుగుల‌తో చ‌రిత్ర సృష్టిస్తే.. రికార్డు ఛేద‌న‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కొత్త అధ్యాయం లిఖించింది. ఈడెన్ గార్సెన్స్‌లో కోల్‌క‌తా నిర్దేశించిన 262 ప‌రుగుల‌ కొండంత ల‌క్ష్యాన్ని సామ్ క‌ర‌న్ సేన ఉఫ్‌మంటూ ఉదేసింది. ఓపెన‌ర్ జానీ బెయిర్‌స్టో (Jonny Bairstow)(108 నాటౌట్) సెంచ‌రీతో చెల‌రేగి పోయాడు. శ‌శాంక్ సింగ్(68 నాటౌట్), ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్(54)లు అర్ధ శ‌త‌కాల‌తో విజృంభించారు. దాంతో, పంజాబ్ భారీ ల‌క్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో ఛేదించింది. పంజాబ్ బ్యాట‌ర్ల ఊచ‌కోత‌తో కోల్‌క‌తాకు (Kolkata Knight Riders) సొంత మైదానంలో వ‌రుస‌గా రెండో ఓట‌మి ఎదురైంది.

 

వ‌రుస‌గా నాలుగు ఓట‌ములు.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు మిణుకుమిణుకు మంటున్న వేళ గెల‌వ‌క త‌ప్ప‌ని మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట‌ర్లు కొద‌మ సింహాల్లా విరుచుకుప‌డ్డారు ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన ఓపెన‌ర్ ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్(54), జానీ బెయిర్‌స్టో(108 నాటౌట్‌)లు ఆకాశ‌మే హ‌ద్దుగా ఆడారు. సునీల్ న‌రైన్ ఓవ‌ర్లో వ‌రుస‌గా ఫోర్, సిక్స‌ర్‌తో హాఫ్ సెంచ‌రీకి చేరువ‌య్యాడు. 18 బంతుల్లోనే అర్ధ శ‌త‌కం సాధించిన అత‌డు ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. ప్ర‌భ్‌సిమ్రాన్‌ను ర‌నౌట్ చేశాన‌నే బాధ‌.. జ‌ట్టును గెలిపించాల‌నే క‌సితో బెయిర్‌స్టో త‌న విధ్వంసాన్ని చూపించాడు.

 

చ‌క్ర‌వ‌ర్తి, న‌రైన్, ర‌స్సెల్ బౌలింగ్‌లో సిక్స‌ర్ల మోత‌తో హాఫ్ సెంచ‌రీ సాధించాడు.

అంత‌కుముందు సొంత‌మైదానంలో నైట్ రైడ‌ర్స్ కొడంత స్కోర్ అందించారు. కోల్‌క‌తా 6 వికెట్ల న‌ష్టానికి 261 ర‌న్స్ కొట్టింది. ఓపెన‌ర్లు ఫిలిప్ సాల్ట్(75), సునీల్ న‌రైన్(71) అర్ధ శ‌త‌కాల‌తో చెల‌రేగి గ‌ట్టి పునాది వేయ‌గా.. చివ‌ర్లో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్(28) వీర‌విహారం చేశాడు. వెంక‌టేశ్ అయ్య‌ర్‌(39 నాటౌట్)తో క‌లిసి ఈడెన్స్‌లో బౌండ‌రీల మోత మోగించాడు. వీళ్లిద్ద‌రూ నాలుగో వికెట్‌కు 43 ర‌న్స్ జోడించారు. దాంతో, పంజాబ్‌కు కోల్‌క‌తా దాదాపు అసాధ్య‌మైన ల‌క్ష్యాన్ని నిర్దేశించ‌గ‌లిగింది.

 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌క‌తాకు ఓపెన‌ర్లు ఫిలిప్ సాల్ట్(75), సునీల్ న‌రైన్(71)లు అదిరే అరంభ‌మిచ్చారు. ఈ ఇద్ద‌రూ త‌మ విశ్వ‌రూపం చూపిస్తూ.. పంజాబ్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. సాల్ట్, న‌రైన్‌లు ఎడాపెడా బౌండ‌రీలు బాదడంతో 8 ఓవ‌ర్ల‌కే స్కోర్ 100 దాటింది. సెంచ‌రీ దిశ‌గా దూసుకెళ్తున్న న‌రైన్‌ను.. రాహుల్ చాహ‌ర్ వెన‌క్కి పంప‌డంతో 138 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ ప‌డింది. ఆ క్ష‌ణం పంజాబ్ జ‌ట్టు కాసింత ఊపిరి పీల్చుకుంది.