New Delhi, AUG 16: టీమ్ఇండియా (Team India)అభిమానులకు గుడ్‌న్యూస్ అందింది. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) అతి త్వరలోనే గ్రౌండ్‌లో అడుగుపెట్టనున్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు అతడి రీ ఎంట్రీకి సైతం ముహూర్తం ఖరారు అయినట్లు ఆ వార్తల సారాంశం. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ(BCCI)కి చెందిన ఉన్నతాధి కారి వెల్లడించాడట. దీంతో పంత్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు రిషబ్ పంత్ కారులో వెలుతుండగా రూర్కీ సమీపంలో అతడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. కారులో మంటలు చెలరేగాయి.
అప్రమత్తమైన పంత్ అద్దం పగలగొట్టుకుని బయటకు దూకేశాడు. దీంతో అతడి తల, మోకాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాలు ఫ్రాక్చర్ అయ్యింది. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. గాయాల నుంచి దాదాపుగా కోలుకున్న పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. వేగంగా కోలుకుంటున్న పంత్ వచ్చే ఏడాది స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 షెడ్యూల్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు భారత్‌కు రానుంది. జనవరిలో ఈ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కల్లా పంత్ ఫిట్‌నెస్ సాధిస్తాడని, సెలక్షన్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి చెప్పినట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ పేర్కొంది.
ఇదిలా ఉంటే.. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఐర్లాండ్ పర్యటనతో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడి కెప్టెన్సీలోనే భారత జట్టు బరిలోకి దిగనుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో నేడు భారత బృందం ఐర్లాండ్ బయలుదేరింది. ఈ టీ20 సిరీస్ ఆగస్టు 18న ఆరంభం కానుంది.