Rohit Sharma in Elite List (PIC@ ICC X)

Lucknow, OCT 29: భార‌త కెప్టెన్‌, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) ఎలైట్ లిస్ట్‌లో (Elite List) చోటు సంపాదించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ల‌క్నో వేదిక‌గా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ (Rohit Sharma) ఈ ఘ‌న‌త సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. త‌ద్వారా ఈ ఘ‌న‌త సాధించిన ఐదో భార‌త క్రికెట‌ర్‌గా నిలిచాడు. ఓవ‌రాల్‌గా 20వ ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. రోహిత్ కంటే ముందు స‌చిన్ టెండూల్క‌ర్‌ (Sachin), విరాట్ కోహ్లీ, రాహుల్ ద్ర‌విడ్‌, సౌర‌వ్ గంగూలీ లు ఉన్నారు. రోహిత్ శ‌ర్మ 457 అంత‌ర్జాతీయ (అన్ని ఫార్మాట్ల‌లో) మ్యాచుల్లో 43.57 స‌గ‌టుతో 86.71 స్ట్రైక్ రేటుతో 18,040 ప‌రుగులు చేశాడు. ఇందులో 45 శ‌త‌కాలు, 99 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన భార‌త ఆట‌గాళ్ల జాబితా..

స‌చిన్ టెండూల్క‌ర్ – 34,357 ప‌రుగులు

విరాట్ కోహ్లీ – 26,121 ప‌రుగులు

రాహుల్ ద్ర‌విడ్ – 24, 208 ప‌రుగులు

సౌర‌వ్ గంగూలీ – 18,575 ప‌రుగులు

రోహిత్ శ‌ర్మ – 18,040 ప‌రుగులు

 

రోహిత్ శ‌ర్మ 257 వ‌న్డేల్లో 49.57 స‌గ‌టుతో 10,510 ప‌రుగులు చేశాడు. ఇందులో 31 సెంచ‌రీలు, 54 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 264. వ‌న్డేల్లో భారత్ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో ఆర‌వ స్థానంలో కొన‌సాగుతున్నాడు. 52 టెస్టుల్లో 46.54 స‌గ‌టుతో 3,677 ప‌రుగులు చేశాడు. ఇందులో 10 సెంచ‌రీలు, 16 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 212. ఇక 148 టీ20 మ్యాచుల్లో 31.32 స‌గ‌టుతో 3,853 ప‌రుగులు చేశాడు. ఇందులో 4 శ‌త‌కాలు, 29 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో భార‌త ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 229 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ (87; 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), సూర్య‌కుమార్ యాద‌వ్ (49) లు రాణించారు. కేఎల్ రాహుల్ (39) ఫ‌ర్వాలేద‌నిపించాడు. శుభ్‌మ‌న్ గిల్ (9), విరాట్ కోహ్లీ (0), శ్రేయ‌స్ అయ్య‌ర్ (4) లు విఫ‌లం అయ్యారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో డేవిడ్ విల్లీ మూడు వికెట్లు తీశాడు. క్రిస్ వోక్స్‌, ఆదిల్ ర‌షీద్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. మార్క్ వుడ్ ఓ వికెట్ సాధించాడు.