Mumbai, March 09: సొంతగడ్డపై అదరగొట్టిన ఇంగ్లండ్‌ను దారుణంగా ఓడించి 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణించిన రోహిత్ శర్మ (Rohit Sharma) పలు రికార్డులు బ్రేక్ చేశాడు. కెరీర్‌లో 12వ టెస్టు సెంచరీతో హిట్‌మ్యాన్ ధర్మశాలలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. మ్యాచ్ అనంతరం రోహిత్ తన రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చాడు. తాను స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిన రోజున వెంటనే ఆటకు వీడ్కోలు పలుకుతానని 36 ఏండ్ల రోహిత్ చెప్పాడు. టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల విజయం అనంతరం రోహిత్.. కామెంటేటర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik)తో మాట్లాడాడు. టెస్టు క్రికెట్ భవిష్యత్తు గురించి మాట్లాడిన భారత కెప్టెన్.. ‘కొన్ని ఏండ్లుగా నేను అత్తుత్యమ క్రికెట్ ఆడుతున్నా. నేను స్టాటిస్టిక్స్‌ను పట్టించుకునే రకం కాదు. పరుగులు చేయడం ఏమంత గొప్ప కాదు. కానీ, ఫోకస్‌గా ఆడడం అనేది చాలా ముఖ్యం. అయితే.. చాలామంది వ్యక్తిగత మైలురాళ్ల మీదనే దృష్టి పెడతారు. నా విషయానికొస్తే.. ఒకవేళ నేను స్థాయికి తగ్గట్టు ఆడడంలేదని నాకు అనిపిస్తే.. మరుక్షణమే ఆటకు వీడ్కోలు పలుకుతా’ అని రోహిత్ వెల్లడించాడు.
భారత జట్టుకు గొప్ప విజయాలు అందించిన రోహిత్ నిరుడు వన్డే వరల్డ్ కప్‌లో దంచాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి శుభారంభాలు ఇస్తూ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అయితే.. కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా.. టీమిండియాకు షాకిచ్చి ఆరోసారి కప్పు పట్టుకెళ్లింది. అయినా సరే.. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో జట్టును నడిపించాల్సిన బాధ్యత బీసీసీఐ అతడికి అప్పగించింది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్.. టీమిండియాకు మాత్రం ఒక్క ఐసీసీ ట్రోఫీ అందించలేకపోయాడు. పొట్టి ప్రపంచ కప్ రోహిత్ తర్వాత భారత జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగే చాన్స్ ఉంది.