
ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ సమరం ఆరంభమైంది. గ్రూప్‌స్టేజ్ మ్యాచ్‌లు నేటి తో పూర్తికానుండగా.. ఈ నెల 22 నుంచి సూపర్-12 మ్యాచ్‌లు (T20 World Cup 2022)మొదలునున్నాయి.ఇందులో గెలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌కు వెళ్లనున్నాయి.ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్‌కు చేరే జట్లపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాప్ నాలుగు స్థానాల్లో ఉంటాయని తాను భావిస్తున్న దేశాల జాబితా (Four Semi-Finalists) పేర్కొన్నాడు. పోటీ ఉన్నప్పటికీ కప్పు మనదే కావాలని ఆశిస్తున్నట్టు తెలిపాడు.
ఈ పోరులో కచ్చితంగా టీమ్‌ఇండియానే ఛాంపియన్‌గా నిలవాలని నేను కోరుకుంటాను. కానీ భారత్‌తో పాటుగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లు సైతం సెమీ ఫైనల్స్‌కు చేరే టాప్ 4 జట్లలో ఉంటాయి. అదే సమయంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా గట్టి పోటీనిస్తాయి. ఈ టోర్నీలో ట్రోఫీ గెలిచే అవకాశాలు మనకు పుష్కలంగా ఉన్నాయి. భారత జట్టు అనుకున్నది సాధించి తీరుతుందని నేను చాలా నమ్మకంగా ఉన్నాను’’ అంటూ సచిన్ ధీమా వ్యక్తం చేశాడు.
జట్టులో జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం పెద్దలోటేనని అయితే అతడి స్థానంలో షమీ రావడం విలువైన ఎంపికని మాజీ కెప్టెన్ తెలిపాడు.మెగాటోర్నీకి జస్ప్రీత్ బూమ్రా దూరమవడంపై.. అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో అతనూ ఒకడని, బూమ్రా లేకపోవడంతో స్పష్టంగా జట్టుపై ప్రభావం చూపుతుందన్నాడు. ప్లేయింగ్ 11లో బూమ్రా కీలక ఆటగాడన్న సచిన్.. జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఉండడం సానుకూల విషయమని చెప్పాడు. మహ్మద్ షమీ సైతం అనుభవజ్ఞుడు, సమర్థుడని.. మెగా టోర్నీలో రాణించగలుగుతాడని క్రికెట్ దేవుడు వివరించారు. ఆసీస్ వేదికగా అక్టోబర్ 23న పాక్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు టీమ్‌ఇండియా సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే.