New Delhi, NOV 21: టీమ్ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ప్రత్యర్థి బౌలర్లకు ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. బౌలర్ బాల్ వేసిందే ఆలస్యం బౌండరీ తరలించడమే లక్ష్యంగా బాదేవాడు. ఇప్పుడు అతడి కొడుకు ఆర్యవీర్ (Virender Sehwag Son Aryaveer) సైతం తండ్రిబాటలోనే సాగుతున్నాడు. ప్రతీష్టాత్మక అండర్-19 టోర్నీ కూచ్ బెహార్ ట్రోఫీలో డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు. ఈ టోర్నీలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్యవీర్ 229 బంతుల్లోనే 200 పరుగులు చేశాడు.
షిల్లాండ్ వేదికగా బుధవారం మేఘాలయ, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో మేఘాలయ తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆర్యవీర్ 229 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 200* పరుగులతో చెలరేడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ 208 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆర్యవీర్‌తో పాటు ధన్యానక్రా (98 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. ఆర్యవీర్ ఈ ఏడాది అక్టోబర్‌లోనే వీనూ మన్కట్ ట్రోఫీలో అరంగ్రేటం చేశాడు. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగులతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కూచ్ బెహార్ ట్రోఫీలో ఆడడం ఆర్యవీర్‌కు ఇదే తొలిసారి. అతడి ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ.