India Vs Bangladesh (PIC@ ICC twitter)

Colombo, SEP 15: ఆసియా క‌ప్ చివ‌రి సూప‌ర్ 4 మ్యాచ్‌లో టీమిండియా(Team India) పోరాడి ఓడిపోయింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌(Bangladesh) అద్భుత విజ‌యం సాధించింది. 266 ప‌రుగుల ఛేద‌న‌లో ఓపెనర్ శుభ్‌మ‌న్ గిల్(121 : 133 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) మ‌రోసారి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. చివ‌ర్లో అక్ష‌ర్ ప‌టేల్(42), శార్ధూల్ ఠాకూర్‌(11) ఎనిమిదో వికెట్‌కు విలువైన 40 ప‌రుగులు జోడించారు. అయితే.. చివ‌రి రెండు ఓవ‌ర్లో 17 ర‌న్స్ అవ‌స‌రం అయ్యాయి. 19వ ఓవ‌ర‌ల్ వేసిన ముస్తాఫిజుర్ రెండు బంతుల తేడాతో ఈ ఇద్ద‌రినీ పెవిలియ‌న్ పంపాడు. 50వ ఓవ‌ర్ నాలుగో బంతికి ష‌మీ(5) ర‌నౌట‌య్యాడు. దాంతో, బంగ్లా 6 ప‌రుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్ట‌రీ కొట్టింది.

 

ఈజీగా గెలుస్తుంద‌నుకున్న భార‌త్‌కు బంగ్లా బౌల‌ర్లు షాకిచ్చారు. యువ పేసర్ తంజిమ్ హొసేన్ ష‌కిబ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(0) డ‌కౌట‌య్యాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న తెలంగాణ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ(5) నిరాశ‌ప‌రిచాడు. గ‌త మ్యాచ్ హీరోలు కేఎల్ రాహుల్‌(19), ఇషాన్ కిష‌న్‌(5) వెంట వెంట‌నే ఔట‌య్యారు. ష‌కిబుల్ హ‌స‌న్ ఓవ‌ర్లో సూర్య‌కుమార్ యాద‌వ్‌(26), ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో ర‌వీంద్ర జ‌డేజా(7) బౌల్డ్ కావ‌డంతో, 170 ప‌రుగుల వ‌ద్ద ఇండియా ఆరో వికెట్ కోల్పోయింది. అక్క‌డి నుంచి గిల్ ఒంటిచేత్తో భార‌త స్కోర్‌బోర్డును ప‌రుగులు పెట్టించాడు. సెంచ‌రీ త‌ర్వాత ధాటిగా ఆడే క్ర‌మంలో ఔటయ్యాడు.

నామ‌మాత్ర‌మైన మ్యాచ్‌లో భార‌త స్టార్ బౌల‌ర్ బుమ్రా, కుల్దీప్ యాద‌వ్‌కు విశ్రాంతినిచ్చారు. దాంతో బంగ్లా 8 వికెట్ల న‌ష్టానికి 265 ప‌రుగులు చేసింది. కెప్ట‌న్ ష‌కిబుల్ హ‌స‌న్‌(80), తౌహిద్ హృదోయ్‌(54) అర్ధ శ‌త‌కాల‌తో అదుకోగా.. చివ‌ర్లో వ‌చ్చిన న‌సుమ్ అహ్మ‌ద్‌(44) దంచి కొట్టాడు. దాంతో, బంగ్లా పోరాడ‌గ‌లిగే స్కోర్ చేయ‌గ‌లిగింది. భార‌త బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్ల‌తో, ష‌మీ 2 వికెట్ల‌తో రాణించారు.